రతన్‌ టాటాపై కోర్టు ధిక్కార పిటిషన్‌

12 Jan, 2017 00:28 IST|Sakshi
రతన్‌ టాటాపై కోర్టు ధిక్కార పిటిషన్‌

టాటా సన్స్‌పై మిస్త్రీ న్యాయ పోరాటం
బోర్డ్‌ నుంచి తొలగింపు ప్రయత్నం జరుగుతోందని విమర్శ  


ముంబై: టాటా గ్రూప్‌ చీఫ్‌ రతన్‌ టాటాసహా హోల్డింగ్‌ కంపెనీ– టాటా సన్స్‌ డైరెక్టర్లపై  నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో సైరెస్‌ మిస్త్రీ నేతృత్వంలోని రెండు ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు తాజాగా ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశాయి. బోర్డ్‌ నుంచి మిస్త్రీని తప్పించడానికి చర్యలు ప్రారంభిస్తూ, ట్రిబ్యునల్‌ గత ఉత్తర్వుల ఉల్లంఘనలకు టాటా సన్స్‌ పాల్పడుతోందన్నది బుధవారం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ ప్రధాన ఆరోపణ. ఫిబ్రవరి 6వ తేదీన టాటా సన్స్‌ ఈజీఎం జరగనుందని, ఈ సమావేశాన్ని నిలుపుచేయడంతోపాటు, ఆ తేదీసహా  మరే రోజునా... గతంలో ట్రిబునల్‌ ఇచ్చిన రూలింగ్‌ను ఉల్లంఘిస్తూ చర్యలు తీసుకోకుండా ఇంజెక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని  ఈ పిటిషన్‌లో సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కోరాయి.

జైలుశిక్ష.. జరిమానా విధించండి...
టాటా బోర్డ్‌ నుంచి డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి సంబంధించి జనవరి 3న టాటా సన్స్‌ ఒక ప్రత్యేక నోటీసు జారీ చేసిందని పిటిషన్‌ పేర్కొంది. డిసెంబర్‌ 22న ఎన్‌సీఎల్‌టీ జారీ చేసిన ఉత్తర్వును పూర్తిస్థాయిలో ఉల్లంఘించడం కిందకే వస్తుందని పిటిషన్‌ వివరించింది. ఈ ఉల్లంఘనలకు గాను టాటాసహా సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్, సర్‌ దొరాబ్జి ట్రస్ట్‌ డైరెక్టర్లకు ఆరు నెలల వరకూ వర్తించే విధంగా సాధారణ జైలు శిక్ష లేదా రూ.2,000 జరిమానా లేదా రెండు శిక్షలూ విధించాలని పిటిషన్‌ ట్రిబునల్‌ను ఆశ్రయించింది. మిస్త్రీ పిటిషన్‌లో ఉన్న డైరెక్టర్లలో ఎన్‌ఏ సూనావాలా, ఆర్‌కే కృష్ణకుమార్, ఆర్‌ వెంకటరమణలు ఉన్నారు.  

ఇంతక్రితం తాము దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్‌ ఉత్తర్వులు జారీ చేస్తూ... ఈ అంశాన్ని  పరిష్కారించేంతవరకూ దీనిపై ఎటువంటి చర్యలు లేదా ప్రక్రియ చేపట్టకూడదని ఆదేశించిందని దిక్కార పిటిషన్‌ పేర్కొంది. టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ– టాటాసన్స్‌ డైరెక్టర్‌గా మిస్త్రీని తొలగించడానికి ఫిబ్రవరి 6వ తేదీన షేర్‌హోల్డర్ల సమావేశం నిర్వహించడానికి రంగం సిద్ధం అయిన నేపథ్యంలో మిస్త్రీ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. టాటా గ్రూప్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి అక్టోబర్‌ 24న మిస్త్రీకి హఠాత్తుగా ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. తరువాత ఆయన ఆరు కంపెనీల బోర్డులకూ రాజీనామా చేశారు. అయితే టాటా సన్స్, ఆ కంపెనీ తాత్కాలిక చైర్మన్‌ రతన్‌ టాటాపై ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేశారు. కార్పొరేట్‌ నియమనిబంధనలను నీరుగారుస్తున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు