డిష్‌ టీవీలో వీడియోకాన్‌ 

23 Mar, 2018 00:52 IST|Sakshi

డీ2హెచ్‌ విలీనం పూర్తి

డీటీహెచ్‌ రంగంలో ఇదే పెద్ద కంపెనీ!  

న్యూఢిల్లీ: ఎట్టకేలకు డిష్‌ టీవీ ఇండియాలో వీడియోకాన్‌ డీ2హెచ్‌ విలీనం పూర్తయింది. దీంతో డైరెక్ట్‌ టు హోమ్‌(డీటీహెచ్‌) రంగంలో అతి పెద్ద సంస్థగా 2.8 కోట్ల మంది చందాదారులతో జీ గ్రూప్‌కు చెందిన డిష్‌ టీవీ ఇండియా అవతరించనుంది. ఈ విలీనానికి 2016 నవంబర్‌లోనే ఇరు కంపెనీల బోర్డ్‌లూ ఆమోదం తెలిపాయి. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ), కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తదితర సంస్థల నుంచి ఆమోదాలు పొందే ప్రక్రియ కారణంగా విలీనానికి ఇంత సమయం పట్టింది. మరోవైపు వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలు దివాలా ప్రక్రియలో ఉండటంతో వీడియోకాన్‌ డీ2హెచ్‌ విలీనంపై ఏమైనా ప్రభావం ఉంటుందేమోనన్న ఉద్దేశంతో డిష్‌ టీవీ తాత్కాలికంగా వెనక్కు తగ్గడం కూడా జాప్యానికి కారణమైంది.

మొత్తం మీద గురువారం నుంచి వీడియోకాన్‌ డీ2హెచ్, డిష్‌ టీవీలు  ఒక్క సంస్థగా కలసిపోయాయని డిష్‌ టీవీ ఇండియా సీఎండీ జవహర్‌ గోయల్‌ చెప్పారు. డిష్‌ టీవీకి 1.55  కోట్ల మంది, వీడియోకాన్‌ డీ2హెచ్‌కు 1.22 కోట్ల మంది చందాదారులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో డిష్‌ టీవీ  రూ.6,086 కోట్ల ఇబిటాను, వీడియోకాన్‌ డీ2హెచ్‌ రూ.1,909 కోట్ల ఇబిటాను ఆర్జించాయి. విలీనం పూర్తయిందన్న వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో డిష్‌ టీవీ 1.6% లాభపడి రూ.67 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు