బీ అలర్ట్‌: వదంతులు నమ్మకండి!

12 Jun, 2018 09:49 IST|Sakshi

సాక్షి, ముంబై: గత రెండు రోజులుగా అన్ని వాట్సాప్ లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతోంది. ‘17వ వార్షికోత్సవం సందర్భంగా డీమార్ట్ రూ.2500 ఫ్రీ షాపింగ్ వోచర్ ఇస్తుంది’’  అనే  వాట్సాప్‌  మెసేజ్‌  వైరల్‌ అవుతోంది. యూజ‌ర్లు వివిధ గ్రూపులలో  దీన్ని ఎక్కువ‌గా షేర్ చేస్తున్నారు. దీనికి  సంబంధించి లింక్ ఓపెన్ చేస్తే అచ్చం డీమార్ట్ వైబ్ సైట్ లానే కనిపించే neuenwfarben.com అనే బోగస్ సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది. అయితే ఇది జర్మనీకి చెందిన ఓ వోచర్ స్కామ్ కు చెందిన వైబ్ సైట్అని, తద్వారా ఈ సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి, ఈ మెసేజ్ ను ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు. ఒకవేళ ఇప్పటికే ఈ మెసేజ్ ఓపెన్ చేసినవారు వెంటనే తమ ఈమెయిల్ ఐడీ, బ్యాంకు, ఇతర ముఖమైన వాటి పాస్ వర్డ్ లు మార్చుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి న‌కిలీ మెసేజ్‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, లేదంటే వైర‌స్‌ ఎటాక్‌తో ఫోన్లు హ్యాకింగ్‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

అటు ఈ విషయంపై డీమార్ట్ కూడా స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, మెసేజ్‌లు అవాస్తవమని,  తాము అటువంటి ఆఫర్లు ఏమీ ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కాగా ఇలాంటి మోసపూరిత మెసేజ్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలి.   మరీ ముఖ్యంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోషల్‌ మీడియా వేదికల ద్వారా షేర్‌ చేసేటపుడు మరింతజాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకటి రెండు సార్లు పరిశీలించుకొని, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే షేర్‌ చేయాలి. ఇది ఎవరికి వారు విధించుకోవాల్సిన నియంత్రణ. లేదంటే మనంతో మోసపోవడంతో పాటూ.. మరింత మందిని  ప్రలోభపెట్టినవారమవుతాం... తస్మాత్‌ జాగ్రత్త!

మరిన్ని వార్తలు