హైదరాబాద్‌లో డేటా సైన్స్‌ కేంద్రం

21 Feb, 2018 00:43 IST|Sakshi

తెలంగాణ–నాస్కామ్‌ భాగస్వామ్యం  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ రంగంలో దూసుకెళ్తున్న భాగ్యనగరి మరో రికార్డు నమోదు చేయబోతోంది. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకై సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు ముందడుగు పడింది. మంగళవారం ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.

ఇక్కడి హెచ్‌ఐసీసీలో జరుగుతున్న నాస్కామ్‌ ఇండియా లీడర్‌షిప్‌ ఫోరం–2018లో భాగంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు సమక్షంలో నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.చంద్రశేఖర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్‌ సంయుక్తంగా ఈ సెంటర్‌కు తొలుత రూ.40 కోట్లు వ్యయం చేస్తాయి. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో తాత్కాలికంగా సెంటర్‌ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌ సమీపంలోని బుద్వేల్‌ వద్ద రానున్న ప్రతిపాదిత డేటా అనలిటిక్స్‌ పార్క్‌లో శాశ్వత కేంద్రాన్ని నెలకొల్పుతారు.

లక్షన్నర మందికి: డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగం భారత్‌లో 2025 నాటికి రూ.1,00,800 కోట్లు నమోదు చేయనుంది. 1,50,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని కె.తారక రామారావు వెల్లడించారు. భవిష్యత్‌ను మార్చనున్న ఎనిమిది రకాల టెక్నాలజీల్లో డేటా సైన్స్, ఏఐ ఉన్నాయని చంద్రశేఖర్‌ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ పాలసీలో భాగంగా ప్రోత్సహించనున్న 10 విభాగాల్లో ఈ రెండు కూడా చోటు దక్కించుకున్నాయని జయేశ్‌ రంజన్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు