హైదరాబాద్‌ హబ్‌లోనే డీబీఎస్‌ టెక్నాలజీ అభివృద్ధి!

6 Mar, 2019 05:59 IST|Sakshi

చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్‌లకు సేవలు ఇక్కడి నుంచే..!

త్వరలోనే రూ.260 కోట్లతో 2 లక్షల చ.అ.ల్లో కొత్త క్యాంపస్‌

ఏడాదిలో కొత్తగా వెయ్యి మంది ఇంజనీర్ల నియామకం

12–18 నెలల్లో దేశంలో వెయ్యి బ్రాంచీల ఏర్పాటు లక్ష్యం

డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా సీఈఓ సురోజిత్‌ షోమీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సింగపూర్‌కు చెందిన డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ సింగపూర్‌ (డీబీఎస్‌) గ్రూప్‌ సాంకేతికత, అభివృద్ధి అంతా హైదరాబాద్‌ కేంద్రంగానే జరుగుతుంది. 2016లో నగరంలో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్‌ ఏషియా హబ్‌ 2ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సింగపూర్‌ తర్వాత రెండో అతిపెద్ద టెక్నాలజీ హబ్‌ ఇదే. ఈ సెంటర్‌లో అతిపెద్ద బ్యాంకింగ్‌ అప్లికేషన్స్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ (ఏపీఐఎస్‌), ఇంటిగ్రేటెడ్‌ ఈ–బ్యాంకింగ్‌ సొల్యూషన్స్, అకౌంటింగ్‌ అండ్‌ ఈఆర్పీ ఫ్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి జరుగుతుందని డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా లిమిటెడ్‌ (డీబీఐఎల్‌) సీఈఓ సురోజిత్‌ షోమీ తెలిపారు.

మన దేశంతో పాటూ చైనా, తైవాన్, సింగపూర్, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లలో 350కి పైగా ఏపీఐఎస్‌ సేవలందిస్తున్నామని చెప్పారు. మంగళవారమిక్కడ డీబీఐఎల్‌ తొలి బ్యాంక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నానక్‌రాంగూడలోని వేవ్‌రాక్‌లో 2 లక్షల చ.అ.ల్లో డీబీఎస్‌ హబ్‌–2 ఉంది. ఇందులో 2 వేల మంది ఇంజనీర్లు, డెవలపర్లు పనిచేస్తున్నారు. త్వరలోనే రూ.260 కోట్ల పెట్టుబడులతో రాయదుర్గంలోని ఆర్‌ఎంజెడ్‌ స్కైవ్యూలో మరొక 2 లక్షల చ.అ.ల్లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించనున్నాం. ఏడాదిలో వెయ్యి మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ నిపుణులను నియమించుకుంటామని’’ ఆయన వివరించారు.

25 నగరాలు, 100 బ్రాంచీలు..
ఇప్పటివరకు డీబీఎస్‌ గ్రూప్‌ ఇండియాలో రూ.7,700 కోట్ల  పెట్టుబడులు పెట్టింది. వచ్చే 12–18 నెలల్లో దేశంలో 25 నగరాల్లో 100 బ్రాంచ్‌లు, కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని లకి‡్ష్యంచాం. ఇందుకోసం రూ.125–150 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాం. ఈ నెల ముగింపు నాటికి అహ్మదాబాద్, కోయంబత్తూరు, వడోదర, ఇండోర్, లుథియానాలో 9 బ్రాంచీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు బ్రాంచీలను ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, నాసిక్, సూరత్, కొల్హాపూర్, సాలీం, కుద్దాలూర్, ముర్దాబాద్‌ నగరాల్లో 12 బ్రాంచ్‌లున్నాయి.

మూడేళ్లలో 1.50 లక్షల కోట్ల వ్యాపారం..
ప్రస్తుతం డీబీఐఎల్‌కు డిపాజిట్లు రూ.30 వేల కోట్లుగా ఉన్నాయి. ఇందులో సీఏఎస్‌ఏ 15–18%గా ఉంది. వచ్చే ఐదేళ్లలో 25 శాతం సీఏఎస్‌ఏ వృద్ధిని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం రూ.50 వేల కోట్ల బ్యాలెన్స్‌ షీట్స్‌ ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యాపారాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నాం. ఇప్పటివరకు కార్పొరేట్‌ రుణాల మీద ఎక్కువ దృష్టిపెట్టాం. ఇక నుంచి ఎస్‌ఎంఈ, రిటైల్‌ రుణాల మీద ఫోకస్‌ చేస్తాం. మొత్తం మొత్తం రుణాల్లో కార్పొరేట్‌ రూ.20 వేల కోట్ల వరకుంటాయి.

18 దేశాలు 280 బ్రాంచీలు..
ఇప్పటివరకు డీబీఎస్‌కు 18 దేశాల్లో 280 బ్రాంచీలు, 1200 ఏటీఎం సెంటర్లున్నాయి. 25 వేల మంది ఉద్యోగులున్నారు. ఏటా 11% వృద్ధి రేటుతో 13.2 సింగపూర్‌ బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో 28% వృద్ధితో 5.6 సింగపూర్‌ బిలియన్‌ డాలర్ల లాభాన్ని మూటగట్టుకుంది.  

హ్యాక్‌థాన్‌ ద్వారా ఉద్యోగుల నియామకం
క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్, ఇంటర్వ్యూ వంటివి కాకుండా డీబీఎస్‌ బ్యాంక్‌ ఉద్యోగుల నియామకాలను హ్యాక్‌థాన్‌ ద్వారా నిర్వహిస్తుంది. డీబీఎస్‌ బ్యాంక్‌ మొత్తం నియామకాల్లో 30–40 శాతం హ్యాక్‌థాన్‌ ద్వారానే ఎంపిక చేస్తుంది. హ్యాక్‌ 2 హైర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఆన్‌లైన్‌ చాలెంజ్‌ నిర్వహించి.. ఎంపికైన అభ్యర్థులు 24 గంటల రియల్‌ లైఫ్‌ బిజినెస్‌ ప్రొబ్లమ్స్‌ను పరిష్కరించాల్సి ఉంటుందని డీబీఎస్‌ ఆసియా హబ్‌ 2 హెడ్‌ మోహిత్‌ కపూర్‌ తెలిపారు. ఒక్కో హ్యాక్‌ 2 హైర్‌లో 13 వేలకు పైగా అభ్యర్థులు పాల్గొంటున్నారని.. క్లౌడ్‌ కంప్యూటింగ్, ఏఐ, మిషన్‌ లెర్నింగ్, బిగ్‌ డేటా విభాగాల్లో సుమారు వంద మంది నిపుణులను నియమించుకుంటామని తెలిపారు. త్వరలోనే 6వ ఎడిషన్‌ను ప్రారంభిచనున్నట్లు  ఆయన చెప్పారు.

నాలుగేళ్ల నిరీక్షణకు తెర..
పాతికేళ్ల క్రితం ముంబైలో తొలి బ్రాంచ్‌ ప్రారంభించిన డీబీఎస్‌ బ్యాంక్‌ 2015లో పూర్తి సొంత అనుబంధ సంస్థ (డబ్ల్యూఓఎస్‌) కోసం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేసుకుంది. నాలుగేళ్ల తర్వాత అంటే ఈ ఏడాది మార్చి 1న ఆర్‌బీఐ అనుమతినిచ్చింది. దీంతో ప్రస్తుతం దేశంలోని 12 డీబీఎస్‌ బ్రాంచీలు కూడా డీబీఐఎల్‌లోకి మారాయి. ప్రస్తుతం మన దేశంలో 45 విదేశీ బ్యాంక్‌లున్నాయి. స్టాండర్డ్‌ చార్డెర్డ్‌కు 100 బ్రాంచీలు, సిటీ బ్యాంక్‌కు 35, హెచ్‌ఎస్‌బీసీకీ 26 బ్రాంచీలున్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మారిషస్‌కు 4 బ్రాంచీలున్నాయి. విదేశీ బ్యాంక్‌ నుంచి డబ్యూఓఎస్‌ బ్యాంక్‌గా మారిన తొలి బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మారిషస్‌. ఇది గతేడాది డిసెంబర్‌లో ఆర్‌బీఐ అనుమతి పొందింది. 

మరిన్ని వార్తలు