లాభాల స్వీకరణతో క్షీణించిన మార్కెట్‌ 

19 Jul, 2018 01:29 IST|Sakshi

147 పాయింట్లు పడిపోయి 36,373కు సెన్సెక్స్‌ 

28 పాయింట్ల నష్టంతో 10,980కు నిఫ్టీ  

లాభాల స్వీకరణ, రాజకీయ పరిణామాల కారణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. ఆరంభంలో సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హైని తాకినప్పటికీ, చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 11,000 పాయింట్ల దిగువకు క్షీణించింది. ఆద్యంతం సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మొత్తం 427 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 147 పాయింట్ల నష్టంతో 36,373 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,980  పాయింట్లకు చేరింది.  లోక్‌సభలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.    

ఆల్‌టైమ్‌ హైకి హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం 
స్టాక్‌ మార్కెట్‌ తీవ్రమైన హెచ్చుతగ్గుల మధ్య కదలాడినప్పిటికీ, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 3.9 కోట్ల షేర్లను ఒక్కో షేర్‌ను రూ.2,174 ధరకు మాతృసంస్థ,  హెచ్‌డీఎఫ్‌సీకి జారీ చేసి రూ.8,500 కోట్లు సమీకరించింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 2,219 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ రూ. 2,024 వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. చివరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.2,176 వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ షేర్‌ రూ.2,008 వద్ద ముగిశాయి. 

లోహ షేర్లకు నష్టాలు.. 
చైనా వృద్ధిపై ఆందోళనల కారణంగా అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ధరలు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. దీంతో లోహ షేర్లు వెలవెలబోయాయి.  

అశోక్‌ లేలాండ్‌ షేర్‌ 14 శాతం డౌన్‌... 
కేంద్ర ప్రభుత్వ కొత్త యాక్సిల్‌ నిబంధనల కారణంగా వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ తగ్గుతుందనే అంచనాలు అశోక్‌ లేలాండ్‌ షేర్‌ను పడగొట్టాయి. ఇంట్రాడేలో 15 శాతం వరకూ నష్టపోయిన  ఈ షేర్‌ చివరకు 14 శాతం నష్టంతో రూ.111 వద్ద ముగిసింది. 

9 ఏళ్ల కనిష్టానికి ఐడియా సెల్యులర్‌ 
ఐడియా షేర్‌ 4.6 శాతం నష్టంతో రూ.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ దాదాపు 8 శాతం పతనమై రూ.48.30 ను తాకింది. ఇది దాదాపు తొమ్మిదేళ్ల కనిష్ట స్థాయి.  

సెన్సెక్స్‌ ఆల్‌టైమ్‌ హై (ఇంట్రాడే) 
తాజా రికార్డ్‌     36,748(18/07/18) 
గత రికార్డ్‌    36,740(13/07/18)  

మరిన్ని వార్తలు