తగ్గనున్న ఆరోగ్య బీమా ప్రీమియంలు!

27 Nov, 2014 01:19 IST|Sakshi
తగ్గనున్న ఆరోగ్య బీమా ప్రీమియంలు!

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య బీమా పాలసీదారులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి వైద్య బీమా పాలసీల ప్రీమియంలు గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఐఐబీ) విడుదల చేసిన తాజా నివేదిక గణాంకాలు ఇదే అంశాన్ని సూచిస్తున్నాయి. మూడేళ్ల క్రితం వరకు భారీ నష్టాలను మూట కట్టుకున్న ఈ రంగం ఇప్పుడు లాభాల బాట పట్టింది. మూడేళ్ల క్రితం మొత్తం వసూలు చేసిన ప్రీమియంల్లో 99 శాతం క్లెయిమ్‌లు ఉంటే అది 2012-13 నాటికి 68 శాతానికి తగ్గినట్లు ఐఐబీ నివేదిక తెలిపింది.

ఈ ఐఐబీ నివేదిక ఆధారంగానే బీమా పాలసీల ప్రీమియాలను పెంచాలా లేక తగ్గించాలా అని ఐఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంటుంది. దీని ప్రకారం చూసే వచ్చే ఏడాది వైద్య బీమా పాలసీల ప్రీమియంలు తగ్గే అవకాశం ఉందని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. 2008, 2009 సంవత్సరాల్లో వసూలు చేసిన ప్రీమియం కంటే క్లెయిమ్‌ల మొత్తం అధికంగా ఉండటంతో ఆరోగ్య బీమా భారీ నష్టాలను మూటకట్టుకునేది. కానీ ఇప్పుడు వసూలైన ప్రీమియంలో క్లెయిమ్‌లు 68 శాతానికి పరిమితం కావడంతో ఈ కంపెనీలకు లాభాలు బాట పట్టాయి.

 వేగంగా వృద్ధి
 దేశీయ ఆరోగ్య బీమా రంగం వేగంగా విస్తరిస్తోంది. గడిచిన మూడేళ్ల కాలంలో పాలసీ అమ్మకాల్లో 21 శాతం వృద్ధి నమోదైనట్లు ఐఐబీ పేర్కొంది. 2010-11లో 77.42 లక్షల ఆరోగ్య పాలసీల అమ్మకాలు జరగ్గా, అది 2012-13 నాటికి 94.10 లక్షలకు చేరింది. ఇదే సమయంలో క్లెయిమ్‌ల సంఖ్య 38.43 లక్షల నుంచి 35.17 లక్షలకు తగ్గింది. ఈ సమీక్షా కాలంలో ప్రీమియం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.10,932 కోట్ల నుంచి రూ. 12,941 కోట్లకు చేరింది.  క్లెయిమ్ నిష్పత్తి గణనీయంగా తగ్గడం, ప్రజల్లో ఆరోగ్య బీమాపై అవగాహన పెరగుతుండటంతో పలు కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

 మహిళల్లో క్లెయిమ్స్ తక్కువ
 పురుషులతో పోలిస్తే మహిళల్లో క్లెయిమ్‌లు తక్కువగా ఉన్నట్లు ఐఐబీ తన నివేదికలో పేర్కొంది. 2012-13 క్లెయిమ్‌లను పరిశీలిస్తే వ్యక్తిగత పాలసీల్లో మహిళల కంటే పురుషులు 29 శాతం అధికంగా క్లెయిమ్ చేస్తే గ్రూపు పాలసీల్లో ఇది 31 శాతం ఉంది. మొత్తం క్లెయిమ్స్‌లో 66 శాతం పురుషులవి ఉంటే మహిళ వాట కేవలం 34 శాతమే.

అలాగే సగటు పురుషుల క్లెయిమ్ మొత్తం రూ. 29,688గా ఉంటే స్త్రీలది రూ.26,688గా ఉంది. లింగ భేదం లేకుండే చూస్తే 36-45 వయస్సు వారిలో అత్యధికంగా క్లెయిమ్‌లు నమోదవుతున్నాయి. అదే 16-35 వయస్సు మధ్యలో పురుషుల కంటే స్త్రీలలో క్లెయిమ్‌లు ఎక్కువగా ఉన్నాయని, దీనికి ప్రసూతి కేసులే కారణమని ఐఐబీ పేర్కొంది. అదే పురుషుల్లో 26-35 ఏళ్ల వారి క్లెయిమ్‌లు అధికంగా ఉన్నాయి.

 హైదరాబాదీలే బెస్ట్
 ప్రధాన మెట్రో నగరాల్లో పోలిస్తే హైదరాబాద్‌లో సగటు క్లెయిమ్ విలువ తక్కువగా ఉంది. సగటు క్లెయిమ్ విలువ రూ. 46,806తో ముంబై మొదటి స్థానంలో ఉంటే, రూ. 40,179తో ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. రూ.33,192తో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. అదే దేశ వ్యాప్తంగా చూస్తే క్లెయిమ్‌ల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏడో స్థానంలో నిలిచింది. క్లెయిమ్‌ల సంఖ్య పరంగా మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2012-13లో 81,091 క్లెయిమ్‌లతో ఉమ్మడి ఆంధ్రపద్రేశ్ ఏడో స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు