రియల్‌ ఎస్టేట్‌ ధరలకు చెక్‌

14 Apr, 2020 16:08 IST|Sakshi

ముంబై : మహమ్మారి కోవిడ్‌-19తో పలు రంగాలపై పెనుప్రభావం పడుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు 20 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందని హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ధరలు దిగివస్తాయని జాతీయ రియల్‌ఎస్టేట్‌ అభివృద్ధి మండలి (నరెడ్కో) రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లతో  ఏర్పాటు చేసిన వెబినార్‌లో పాల్గొన్న పరేఖ్‌ ఈ వ్యాఖ‍్యలు చేశారు.

కోవిడ్‌-19 ప్రభావంతో రియల్‌ ఎస్టేట్‌ ధరలు 10 నుంచి 15 శాతం తగ్గుతాయని నరెడ్కో అంచనా వేస్తుండగా 20 శాతం ధరలు పడిపోతాయనే అంచనాతో సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కలిగి నగదు ప్రవాహం బాగా ఉన్న వారు ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఇది సరైన సమయమని పరేఖ్‌ చెప్పుకొచ్చారు. రియల్‌ ఎస్టేట్‌ అత్యుత్తమమైన ఆస్తి అని, అంతర్జాతీయంగా నిర్మాణ రంగ విలువ అన్ని షేర్లు, బాండ్లు కలిపిన విలువ కంటే అత్యధికమని చెప్పారు.

చదవండి : రియల్టీకి లక్ష కోట్ల నష్టం!

అందుబాటు గృహాల కొనుగోళ్లకు ప్రభుత్వం పలు రాయితీలు ప్రకటించినా ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తు చోటుచేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. మారటోరియంను ఆఖరి అవకాశంగా వాడుకోవాలని డెవలపర్లకు ఆయన సూచించారు. నిధుల సమీకరణకు రుణాల కంటే ఈక్విటీ వైపు మొగ్గుచూపాలని కోరారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ముందు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను పూర్తిచేయడంపై డెవలపర్లు దృష్టిసారించాలని సూచించారు. ‘ఇంటికి తక్కువ డబ్బు తీసుకువెళ్లండి..కంపెనీలోనే అధిక సొమ్ము ఉండేలా చూస్తూ ఖర్చులను నియంత్రించా’లని డెవలపర్లను కోరారు.

>
మరిన్ని వార్తలు