ఓవీఎల్‌ను లిస్ట్‌ చేయండి

22 Aug, 2018 00:30 IST|Sakshi

ఓఎన్‌జీసీకి లేఖ రాసిన దీపమ్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఓఎన్‌జీసీ.. తన విదేశీ అనుబంధ సంస్థ, ఓఎన్‌జీసీ విదేశ్‌ను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయాలని ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఓఎన్‌జీసీ విదేశ్‌(ఓవీఎల్‌)ను స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేయడం ద్వారా వచ్చిన నిధులను స్పెషల్‌ డివిడెండ్‌గా చెల్లించాలని, తద్వారా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని చేరుకునేలా చూడాలని ప్రభుత్వం ఓఎన్‌జీసీకి తెలిపింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌  అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌(దీపమ్‌) గత వారం ఓఎన్‌జీసీకి ఒక లేఖ రాసింది.

ఓవీఎల్‌ను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌  చేయడం వల్ల ఆ సంస్థ కార్పొరేట్‌ గవర్నెన్స్, సమర్థతలు మరింతగా మెరుగుపడతాయని ఈ లేఖలో దీపమ్‌ పేర్కొంది. ఓఎన్‌జీసీ వంద శాతం అనుబంధ సంస్థగా ఓఎన్‌జీసీ విదేశ్‌ 20కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 41 ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది. ఓవీఎల్‌లో ఓఎన్‌జీసీ ఇప్పటిదాకా రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టింది. కాగా ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 67.45 శాతం వాటా ఉంది. కాగా 2015లోనే ఓవీఎల్‌ను లిస్ట్‌ చేయాలని ఓఎన్‌జీసీని ప్రభుత్వం అడిగింది. కానీ చమురు ధరలు మందగమనంగా ఉన్నాయని, లిస్టింగ్‌కు సరైన సమయం కాదని ఓఎన్‌జీసీ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది.

ఇప్పుడు లిస్టింగ్‌ ఎందుకంటే....
గత ఆర్థిక సంవత్సరంలో హెచ్‌పీసీఎల్‌లో 51.1 శాతం వాటాను ఓఎన్‌జీసీ రూ.36,915 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని ప్రభుత్వం సునాయాసంగా సాధించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.80,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జూలై 5 నాటికి రూ.9,220 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది.

మరిన్ని వార్తలు