మిసా భారతి, ఆమె భర్తకు ఊరట

5 Mar, 2018 10:54 IST|Sakshi

పటియాలా : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూతురు మిసా భారతికి, ఆమె భర్త శైలేశ్‌ కుమార్‌కు పటియాలా హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. మనీలాండరింగ్‌ కేసులో వీరిద్దరికీ పటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ కోసం 2 లక్షల రూపాయలను ష్యూరిటీ కింద సమర్పించాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీచేసింది. కోర్టు అనుమతి లేకుండా.. దేశం విడిచి వెళ్లకూడదని కూడా ఆదేశాలు జారీచేసింది. వీరిద్దరిపై ఈడీ డిసెంబర్‌లో ఛార్జ్‌షీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఛార్జ్‌షీటు నమోదు మేరకు నేడు కోర్టుకు హాజరు కావాలని వీరిద్దరినీ కోర్టు ఆదేశించింది. మిస్‌ మిశాలి ప్యాకర్స్‌ అండ్‌ ప్రింటర్స్‌ పేరుపై భారతీ, ఆమె భర్త ఢిల్లీలో ఓ ఫామ్‌ హౌస్‌ కొనుగోలు చేశారు. 2008-09లో షెల్‌ కంపెనీల ద్వారా ఆర్జించిన అక్రమ సంపద రూ.1.2 కోట్లతో ఈ కొనుగోలు చేపట్టారు.

పలు షెల్‌ కంపెనీలు భాగమై ఉన్న రూ.8000 కోట్ల మనీ లాండరింగ్‌ కేసు విచారణలో ఈ ఫామ్‌ హౌస్‌ కొనుగోలు కూడా ఒకటి. ఫామ్‌ హౌస్‌ కొనుగోలపై మిశాను ప్రశ్నిస్తే.. మిశాలి ప్యాకర్స్‌ కంపెనీతో తనకేమీ సంబంధం లేదని, దాన్ని తన భర్త, సందీప్‌ శర్మ అనే ఛార్టెడ్‌ అకౌంటెండ్‌ కలిసి నిర్వహించే వారని తెలిపింది. శైలేష్‌ కూడా తాను ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను రోజువారీ సమీక్షించలేదని, ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ శర్మనే అన్నీ చూసుకునే వారని చెప్పారు.  అయితే ఆ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నందుకు మీరే బాధ్యత వహించాలని ఈడీ చెప్పింది. మిసా భారతి, శైలేష్‌ కుమార్‌, జైన్‌ బ్రదర్స్‌ రూ.1.20 కోట్ల మనీలాండరింగ్‌లో ప్రధాన వ్యక్తులని ఈడీ కోర్టుకు తెలిపింది.

మరిన్ని వార్తలు