విదేశాలకు వెళ్లాలనుకుంటే 18,000 కోట్లు కట్టండి

10 Jul, 2019 05:04 IST|Sakshi
నరేష్‌ గోయల్‌

జెట్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు తేల్చిచెప్పిన ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు గట్టి షాకిచ్చింది. విదేశాలకు వెళ్లాలనుకుంటే, ఆయన కంపెనీ (జెట్‌ఎయిర్‌వేస్‌) రుణదాతలకు బకాయి పడిన రూ.18,000 కోట్లను గ్యారంటీ కింద డిపాజిట్‌ చేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. దేశం విడిచి వెళ్లేందుకు గోయల్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన లుకవుట్‌ సర్క్యులర్‌ (విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే, సంబంధిత వ్యక్తి పోలీసుల విచారణకు అసరమా అని గుర్తించి నిలిపివేయడం)ను సవాల్‌ చేయగా, దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందనను కోర్టు కోరింది.

‘‘ఈ సమయంలో గోయల్‌కు ఎటువంటి మధ్యంతర ఉపశమనం కల్పించేది లేదు. మీరు 18,000 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు సిద్ధపడితే, విదేశానికి వెళ్లొచ్చు’’ అని ఢిల్లీ హైకోర్టు జస్టిస్‌ సురేష్‌ కైత్‌ అన్నారు. ఈ ఏడాది మే 25న దుబాయికి వెళ్లే విమానం నుంచి, గోయల్, అతని భార్య అనిత్‌ను విమానాశ్రయంలో దించేసిన విషయం గమనార్హం. అయితే, తనపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకపోయినా, లుకవుట్‌ సర్క్యులర్‌ పేరిట ఈ విధమైన చర్య తీసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ గోయల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. తమ స్పందన తెలియజేయాలని హోం, కార్పొరేట్, న్యాయ శాఖలను  ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్‌ 23కు వాయిదా వేసింది.

నిధుల కోసమే...  
గోయల్‌ దంపతుల తరఫున న్యాయవాది మణిందర్‌సింగ్‌ వాదనలు వినిపించారు. మే 25న వారిని విమానం నుంచి దించేసినప్పుడు, వారు విచారణను తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పేందుకు ఏ ఆధారం చూపలేదన్నారు. హైకోర్టులో గోయల్‌ పిటిషన్‌ దాఖలు చేసే వరకు ఆయనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని, జూలై 6న మాత్రం, పిటిషన్‌ విచారణకు వచ్చినప్పుడు, ఎస్‌ఎఫ్‌ఐవో నుంచి విచారణకు రావాలని గోయల్‌కు సమన్లు అందినట్టు వివరించారు. తమ క్లయింట్లు ఎన్‌ఆర్‌ఐ హోదా కలిగిన వారని, జెట్‌ గ్రూపు కోసం నిధులు సమకూర్చుకునేందుకు దుబాయి, లండన్‌ వెళ్లాలనుకున్నట్టు తెలిపారు.

గోయల్‌కు బ్రిటన్‌ నివాస వీసా, యూఏఈ నివాస పర్మిట్‌ ఉన్నాయని, ఇవి ఈ నెల 10, 23వ తేదీల్లో గడువు రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉన్నందున వెంటనే బ్రిటన్, యూఏఈ వెళ్లాల్సి ఉందన్నారు. అయితే, నరేష్‌ గోయల్‌ అభ్యర్థనకు వ్యతిరేకంగా అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ మణిందర్‌ ఆచార్య వాదనలు వినిపిస్తూ... ఇది తీవ్రమైన రూ.18,000 కోట్ల మోసమని, ఎస్‌ఎఫ్‌ఐవో ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నట్టు తెలిపారు. ఈ విచారణలో గోయల్‌ పాల్గొని తన స్పందనను తెలియజేయాల్సి ఉందన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా