జోరుగానే భారత్‌ వృద్ధిరేటు..!

14 Mar, 2018 01:45 IST|Sakshi

2018లో ఊహించినదానికన్నా అధికంగానే!

డెలాయిట్‌ తాజా నివేదికలో విశ్లేషణ  

న్యూఢిల్లీ: భారత్‌ వృద్ధి వేగం 2018లో ఊహించినదానికన్నా వేగంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– డెలాయిట్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. గ్రామీణ డిమాండ్‌ పునరుద్ధరణ, మౌలిక రంగంలో వ్యయాల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది.

రుణ ఇబ్బందులు పెరిగినా, అమెరికా వంటి దేశాలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు అనుసరించినా భారత్‌ వృద్ధి వేగవంతంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్‌ వ్యక్తం చేసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల, అలాగే మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా వృద్ధి పురోగతిపై ప్రభావం చూపబోవని అభిప్రాయపడింది.  ‘వాయిస్‌ ఆఫ్‌ ఆసియా’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే...

దేశీయ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇది వృద్ధి ఊపందుకోడానికి దోహదపడే అంశం.  
 వృద్ధి రికవరీ బాగుంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో 7.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు బాగున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి.  
డీమోనిటైజేషన్, జీఎస్‌టీ ప్రారంభ కష్టాలు వంటి అంశాలు వృద్ధిని బలహీనపరిచాయి. అయితే ఆయా సమస్యలు ప్రస్తుతం తొలగిపోతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిని సరైన దిశకు నడిపిస్తున్నాయి.  
భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2017 మూడవ త్రైమాసికంలో వృద్ధి బాగుంది. 2018లో కూడా4 వృద్ధి పురోగతి కొనసాగే వీలుంది. 6.8 శాతం నంచి 6.9 శాతం శ్రేణిలో వృద్ధి నమోదయ్యే వీలుంది.  
♦  దేశీయంగా డిమాండ్‌ బాగుంది. వినియోగం పెరుగుతోంది. చిన్న తరహా పరిశ్రమలు పుంజుకుంటున్నాయి.  
♦  అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్‌ ఇండియాకు చేయూత వంటివి వృద్ధికి దోహదపడే అంశాలు.

అంతర్జాతీయ వృద్ధి 3.7 శాతం.  
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 75 శాతానికిపైగా పురోగమన దశలో ఉంది. 2017లో 3.6 శాతం వృద్ధి నమోదయితే, 2018లో ఇది 3.7 శాతానికి చేరే అవకాశం ఉంది. 2016లో ఈ రేటు 3.2 శాతం.

మరిన్ని వార్తలు