ఏపీలో ‘వికా’ భారీ విస్తరణ

27 Sep, 2019 02:04 IST|Sakshi

వికా గ్రూపు చైర్మన్‌ గై సిడోస్‌

11 మిలియన్‌ టన్నులకు సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం

కడప భారతి సిమెంట్‌లో 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌

ఏపీలో ప్రభుత్వ గృహ నిర్మాణంతో సిమెంటుకు డిమాండ్‌

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో కంపెనీల పెట్టుబడులు

సాక్షి, అమరావతి : ఫ్రెంచ్‌ సిమెంట్‌ దిగ్గజ సంస్థ వికా ఇండియాలో భారీగా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. కార్పొరేట్‌ ట్యాక్స్‌ను కేంద్రం భారీగా తగ్గించడంతో రానున్న రోజుల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు వికా గ్రూపు చైర్మన్‌ గై సిడోస్‌ వెల్లడించారు. ఫ్రాన్స్‌ ప్రతినిధుల బృందంతో రెండు రోజుల పాటు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సిడోస్‌... దేశవ్యాప్తంగా సిమెంట్‌ పరిశ్రమ పరిస్థితులు, విస్తరణ ప్రణాళికలను ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. ఆ వివరాలు... 

కొన్ని నెలలుగా దేశీయ సిమెంట్‌ పరిశ్రమ తిరోగమన దశలో ఉంది. మున్ముందు పుంజుకునే అవకాశాలున్నాయా? 
వృద్ధిరేటు మందగమనంతో కొంత కాలంగా సిమెంట్‌ పరిశ్రమ కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశీ సిమెంట్‌ పరిశ్రమలో తీవ్రమైన పోటీ ఉండటంతో ధరల్లో హెచ్చుతగ్గులు సహజమే. ప్రభుత్వం ఇన్‌ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టడంతోపాటు, రహదారులు, గృహ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. కాబట్టి ము న్ముందు సిమెంట్‌కు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వమే 25 లక్షల గృహాలను నిర్మించాలని నిర్ణయించింది. ఈ అంశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.

కేంద్రం ఒక్కసారిగా కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 10% తగ్గించడాన్ని ఎలా చూస్తున్నారు? 
ఇది వృద్ధిరేటును పెంచే సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పటి వరకు ఇండియాలో కార్పొరేట్‌ ట్యాక్స్‌ అధికంగా ఉండేది. దీన్ని కేంద్రం ఒక్కసారిగా భారీగా తగ్గించడమే కాకుండా ఇతర దేశాల కంటే కనిష్ట స్థాయికి తీసుకొచ్చింది. ఈ నిర్ణయంతో కంపెనీలకు అదనపు నిధులు వస్తాయి. దీంతో కంపెనీల విస్తరణ సామర్థ్యాలు పెరుగుతాయి.  

కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గన నేపథ్యంలో విస్తరణ ప్రణాళికలేమైనా ఉన్నాయా? 
దేశంలో సిమెంట్‌కు డిమాండున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాం. ప్రస్తుతం కడపలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన భారతి సిమెంట్, కర్నాటక జిల్లా కల్బుర్గిలో మరో యూనిట్‌ ఉన్నాయి. ఈ రెండు యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 8 మిలియన్‌ టన్ను లు. దీన్ని రానున్న సంవత్సరాల్లో 11 మిలియన్‌ టన్నులకు పెంచాలని లకి‡్ష్యంచుకున్నాం.

ఏపీలో కొత్తగా ఏమైనా పెట్టుబడులుపెడుతున్నారా? 
ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. కాకపోతే వీటి గురిం చి ఇప్పుడే వివరించలేం. పునురుత్పాదక ఇంధన రంగంలోకి అడుగుపెడుతున్నాం. ఇందులో భాగంగా కడప భారతి యూనిట్‌లో సొంత అవసరాల కోసం 10 మెగా వాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తాం. 

ఈ రెండు రోజులూ మీ పర్యటన ఎలా సాగింది? 
ఫ్రాన్స్‌కు చెందిన పరిశ్రమలు, వాణిజ్య ప్రతినిధుల సమాఖ్య (మెడెఫ్‌) సభ్యులతో కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్న రంగాలను పరిశీలించాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులకు సహకారమందిస్తామని చెబుతోంది. ముఖ్యంగా అర్బన్‌ ఇన్‌ఫ్రా, పోర్టులు, ఎనర్జీ, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో అనేక అవకాశాలున్నాయి. ఈ పర్యటన ఫలితాలు రానున్న కొద్ది నెలల్లోనే ఏపీ చూస్తుంది. 

మరిన్ని వార్తలు