గృహోపకరణాల సేల్స్ బాగుంటాయ్!

10 Jun, 2014 01:59 IST|Sakshi
గృహోపకరణాల సేల్స్ బాగుంటాయ్!
  •  జూన్ తర్వాతి నుంచి అమ్మకాలకు జోష్  
  •  ఈ ఏడాది 15 శాతం వృద్ధి ఆశిస్తున్న కంపెనీలు
  •  హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ కంపెనీలు బిజీ బిజీగా ఉన్నాయి. ఈ ఏడాది నుంచి మార్కెట్ పుంజుకుంటుందన్న విశ్వాసంతో డిమాండ్‌ను అందుకోవడానికి తగిన ఏర్పాట్లలో మునిగిపోయాయి. కొత్త కొత్త మోడళ్లతో కస్టమర్లకు దగ్గరవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. స్థిర ప్రభుత్వం రాకతో మార్కెట్ సెంటిమెంటు బలపడిందని గృహోపకరణాల కంపెనీలు అంటున్నాయి. మరోవైపు ఎండవేడిమి కూడా ఏసీ, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలు పెంచేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నాయి. మొత్తంగా 2014 నుంచి పరిశ్రమ వృద్ధి ఉంటుందని ఆనందంగా ఉన్నాయి. దేశంలో ఎలక్ట్రానిక్స్,  గృహోపకరణాల విపణి పరిమాణం రూ.40,000 కోట్లుంది.
     
     15 శాతం వృద్ధి..: కొన్నేళ్లుగా భారత గృహోపకరణాల మార్కెట్ స్తబ్దుగా ఉంది. దేశీయంగా సెంటిమెంటు బలహీనంగా ఉండడం, రూపాయి విలువ క్షీణించడంతో ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఇక్కడి కంపెనీలకు భారమయ్యాయి. దీంతో కంపెనీలు ఉపకరణాల ధర పెంచకతప్పలేదు. ఈ ప్రభావం కాస్తా అమ్మకాలపై పడింది. అయితే స్థిర ప్రభుత్వం రాకతో మార్కెట్ వాతావరణం మారిందని ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జీఎల్ మిర్‌చందానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. జూన్ తర్వాతి నుంచి అమ్మకాలు పుంజుకుంటాయని ఆయన చెప్పారు. 2014లో గృహోపకరణాల విపణి 15 శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2014-15లో 10-15 శాతం వృద్ధితో తమ కంపెనీ రూ.1,500-1,700 కోట్ల వ్యాపారం ఆశిస్తోందని పేర్కొన్నారు.
     
    అన్ని విభాగాల్లోనూ..: టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ ఏడాది మంచి అమ్మకాలు ఉంటాయని పరిశ్రమ చెబుతోంది. గతేడాది దేశవ్యాప్తంగా 31 లక్షల ఏసీలు అమ్ముడయ్యాయి. 2014లో ఈ సంఖ్య 34 లక్షలకు చేరుకుంటుందని బ్లూ స్టార్ రూమ్ ఏసీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సి.పి.ముకుందన్ మీనన్ తెలిపారు. ఈ ఏడాది 2.8 లక్షల ఏసీలను విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నామని, గతేడాదితో పోలిస్తే ఇప్పటికే కంపెనీ 10-12 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. ఏసీల అమ్మకాల్లో 5 శాతం వృద్ధి చెందామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. రిఫ్రిజిరేటర్ల విభాగంలో గతేడాది మాదిరిగా నిలకడైన వృద్ధి ఉంటుందని చెప్పారు.
     
    నూతన ఉత్పత్తులు కూడా..: హాయర్ ఒక అడుగు ముందుకేసి 60కిపైగా ఉత్పత్తులను ఈ ఏడాది ప్రవేశపెట్టింది. మరిన్ని ఉత్పత్తులు కస్టమర్ల ముందుకు రానున్నాయని హాయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో తమ కంపెనీ 35 శాతం వృద్ధి ఆశిస్తోందని చెప్పారు. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో టీవీల అమ్మకాలు రెండింతలు అవుతాయని అంచనా వేస్తున్నట్టు సోనీ వెల్లడించింది. మార్కెట్ సానుకూల పవనాలతో ఆశించిన వృద్ధి సాధిస్తామని సోనీ సేల్స్ హెడ్ సునిల్ నయ్యర్ తెలిపారు. బ్రేవియా టీవీల విభాగంలో రెండు మోడళ్లను ఇటీవలే ప్రవేశపెట్టామని చెప్పారు. జూన్ తర్వాతి నుంచి కంపెనీలకు మంచి రోజులని కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా) తెలిపింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది మార్కెట్ మలుపుతిప్పుతుందని సియామా ప్రెసిడెంట్ అనిరుధ్ ధూత్ అన్నారు.

మరిన్ని వార్తలు