‘టైమ్‌’.. చాలా ఖరీదు!

23 Feb, 2018 00:13 IST|Sakshi

ప్రీమియం వాచీలకు డిమాండ్‌

వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌

2025 నాటికి టాప్‌–10లో చేరిక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చోపా, పాటక్‌ ఫిలిప్, జేగర్‌ లేకూట్, వషెరో కున్‌స్టాంటా, ఒడేమార్‌ పీగే, ఒమేగా, రోలెక్స్, టాగ్‌ హోయెర్‌.. ఇటువంటి అత్యంత ఖరీదైన చేతి వాచీ బ్రాండ్లకు భారతీయులు ఉవ్విళ్లూరుతున్నారట. ఇలాంటివి ఇప్పుడు 30 దాకా బ్రాండ్లు ఇక్కడ కొలువుదీరాయి.

వీటికోసం కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదు. పైగా దుబాయ్‌ వంటి షాపింగ్‌ కేంద్రాలతో పోలిస్తే వాచీల ధర భారత్‌లోనే తక్కువగా ఉంది. ఇక్కడ అమ్మకాలు పెరిగేందుకు ఈ అంశం దోహదం చేస్తోందని విక్రేతలు చెబుతున్నారు. 2025 నాటికి టాప్‌–10 లగ్జరీ వాచీల మార్కెట్‌గా భారత్‌ అవతరించనుందని 160 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రాండ్‌ చోపా అంటోంది.  

ఖరీదుకు వెనుకాడరు..
లగ్జరీ కోసం భారతీయులు ఎంతైనా వెచ్చిస్తారని చోపా బ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ సేల్స్‌ మేనేజర్‌ జవియే లెస్సే సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. రూ.6.9 కోట్ల విలువైన ఇంపీరియల్‌ వాచీని సైతం భారత్‌లో విక్రయించామని చెప్పారు. తమ కంపెనీకి చెందిన 45 విభాగాల నిపుణులు ఏడాదిపాటు శ్రమిస్తే ఒక వాచీ తయారవుతుందని వెల్లడించారు.

భారత్‌ కోసం తయారైన ఎక్స్‌క్లూజివ్‌ మోడళ్ల కంటే అంతర్జాతీయంగా లభిస్తున్న వాచీలను కొనేందుకు ఇక్కడివారు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. లగ్జరీ విషయంలో 2025 నాటికి టాప్‌–10 మార్కెట్లలో ఒకటిగా భారత్‌ నిలుస్తుందని పేర్కొన్నారు.

నాల్గవ స్థానంలో హైదరాబాద్‌..
రూ.2 లక్షలు ఆపైన ధర గల వాచీల విభాగం ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఈ విభాగంలో నెలకు దేశవ్యాప్తంగా 300 పీసులు అమ్ముడవుతు న్నాయని అంచనా. మూడేళ్ల క్రితం ఈ సంఖ్య 200 పీసులు ఉండేదని సమాచారం.కొనుగోళ్ల పరంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

నాల్గవస్థానం కోసం హైదరాబాద్, చెన్నై లు పోటీపడుతున్నాయని వాచీల రిటైల్‌ దిగ్గజం కమల్‌ వాచ్‌ కంపెనీ ఎండీ వేణు గోపాల్‌ తెలిపారు. దుబాయ్‌ వంటి షాపింగ్‌ డెస్టినేషన్లతో పోలిస్తే భారత్‌లోనే ధర 8 శాతం దాకా తక్కువగా ఉందన్నారు. దీంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు. 23 స్టోర్ల ద్వారా తాము 50 రకాల బ్రాం డ్ల వాచీలను హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది చివరినాటికి మరో 15 కేంద్రాలు నెలకొల్పుతామన్నారు.

ఇదీ వాచీల మార్కెట్‌..
భారత్‌లో వాచీల విపణి వార్షిక పరిమాణం రూ.7,700 కోట్లకు చేరుకుంది. అవ్యవస్థీకృత రంగంలోనూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. వ్యవస్థీకృత రంగంలో అన్ని ధరల శ్రేణుల్లో 75 బ్రాండ్ల దాకా పోటీపడుతున్నాయి. ఏటా పరిశ్రమ 15 శాతం వృద్ధి చెందుతోంది.

మొత్తం అమ్మకాల్లో రూ.10,000 లోపు వాచీలు 65 శాతం ఉంటాయి. రూ.10 వేల నుంచి రూ.1 లక్ష వరకు 20 శాతం, రూ.1 లక్ష పైన ఖరీదైన వాచీల పరిమాణం 15 శాతముందని రిటైల్‌ చైన్‌ బ్రాండ్‌ జస్ట్‌ వాచెస్‌ చెబుతోంది. ఇక భారత్‌కు దిగుమతి అవుతున్న వాటిలో స్విస్‌ వాచీల వాటా ఏకంగా 30 శాతం దాకా ఉంది. పెద్ద పెద్ద బ్రాండ్లను పోలిన నకిలీ వాచీలు ఆన్‌లైన్‌లో లక్షలాది రకాలు లభిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు