చిన్న వాహన రుణాలకు నోట్ల రద్దు దెబ్బ!

28 Jan, 2017 01:37 IST|Sakshi
చిన్న వాహన రుణాలకు నోట్ల రద్దు దెబ్బ!

ఫిచ్‌ రేటింగ్స్‌ నివేదిక...
ముంబై: దేశంలో పెద్ద నోట్ల రద్దు చిన్న వాహన పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీసిందని అంతర్జాతీయ గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం–  ఫిచ్‌ రేటింగ్స్‌ పేర్కొంది. చిన్న ఆటో రుణ గ్రహీతలు పునఃచెల్లింపుల సామర్థ్యాన్ని కోల్పోయారని పేర్కొంటూ, నోట్ల రద్దు వల్ల వారి ఆదాయాలు గణనీయంగా పడిపోవడమే దీనికి కారణమని తన తాజా నివేదికలో వివరించింది. దీనితోపాటు పెద్ద నోట్ల రద్దు అసంఘటిత రంగంపై ప్రతికూల ప్రభావం చూపిందని కూడా నివేదిక పేర్కొంది. ఇది ఆర్థిక క్రియాశీలతకు విఘాతం కలిగించిందని విశ్లేషించింది. పరిస్థితి అదుపులోకి రావడానికి మరో రెండు, మూడు నెలలు పడుతుందని తాము భావిస్తున్నట్లు వివరించింది.

మార్చి నాటికి సర్దుకుంటుంది: నోమురా
ఇదిలావుండగా, పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన నగదు గందరగోళం మార్చినాటికి సర్దుకుం టుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– నోమురా పేర్కొంది. కరెన్సీ–జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి మార్చినాటికి 9 శాతానికి చేరుకుం టుందని, దీనివల్ల మనీ సర్‌క్యులేషన్‌లో ఇబ్బం దులు తప్పుతాయని విశ్లేషించింది. నోమురా తెలిపిన సమాచారం ప్రకారం– 2016 నవంబర్‌ 4న జీడీపీలో కరెన్సీ సర్‌క్యులేషన్‌ పరిమాణం 11.8 శాతంగా ఉంది.

అటు తర్వాత జనవరి 6 నాటికి ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి 5.9 శాతానికి పడిపోయింది. ఆపైక్రమంగా పెరుగుతూ జనవరి 20వ తేదీ నాటికి 6.9 శాతానికి చేరింది. మార్చి నాటికి పరిస్థితి మరింత మెరుగుపడుతుందని నోమురా పరిశోధనా నివేదిక వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏర్పడిన ఆర్థిక ప్రతిష్టంభన ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని, తిరిగి వృద్ధి రికవరీ మెరుగుపడుతుందని భావిస్తున్నామని కూడా వివరించింది.

మరిన్ని వార్తలు