నోట్ల రద్దు తీరు ‘అరాచకం’

11 Jan, 2017 00:14 IST|Sakshi
నోట్ల రద్దు తీరు ‘అరాచకం’

నగదు కొరతతో భారతీయులకు తీవ్ర ఇబ్బందులు
డీమోనిటైజేషన్‌పై న్యూయార్క్‌ టైమ్స్‌ వ్యాఖ్యలు


న్యూయార్క్‌: నల్లధనం, అవినీతిపై పోరు పేరిట ప్రభుత్వం పెద్ద నోట్లను ఆకస్మికంగా రద్దు చేసి, ప్రజలను ఇబ్బందుల పాల్జేయడాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ (ఎన్‌వైటీ) పత్రిక మరోసారి తీవ్రంగా ఎండగట్టింది. డీమోనిటైజేషన్‌ ప్రతిపాదన, అమలు తీరును అరాచకమైన చర్యగా అభివర్ణించింది. పెద్ద నోట్ల రద్దు, నగదు కొరతతో భారతీయుల జీవితాలు దుర్భరంగా మారాయని సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. డీమోనిటైజేషన్‌ చర్యలతో ప్రభుత్వం నల్లకుబేరులను గుర్తించినట్లు గానీ.. దేశంలో అవినీతి తగ్గిందనడానికి గానీ ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని పేర్కొంది. డీమోనిటైజేషన్‌ అమల్లోకి తెచ్చి రెండు నెలలు గడుస్తున్నా భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అవస్థలు పడుతూనే ఉందని ఎన్‌వైటీ తెలిపింది. ’తయారీ రంగం మందగిస్తోంది, రియల్‌ ఎస్టేట్‌.. కార్ల అమ్మకాలు తగ్గాయి.

వ్యవసాయ కూలీలు, దుకాణదారులు, ఇతరత్రా భారతీయులు నగదు కొరతతో జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని పేర్కొంది. పాత పెద్ద నోట్లను కొత్త నోట్లకు బదలాయించుకునే ప్రక్రియను రూపొందించిన తీరు, అమలు చేసిన విధానం చాలా దారుణంగా ఉందని ఆక్షేపించింది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్‌ లావాదేవీల కోసం ప్రజలు గంటల కొద్దీ బ్యాంకుల్లో పడిగాపులు పడాల్సి వచ్చిందని పేర్కొంది. ’నవంబర్‌ 4 నాటికి దాదాపు 17.7 లక్షల కోట్ల నగదు చలామణీలో ఉండగా.. నోట్ల రద్దు దరిమిలా డిసెంబర్‌ 23 నాటికి అందులో సగానికి అంటే. రూ. 9.2 లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు, ప్రభుత్వం ముందుగానే తగినన్ని కొత్త నోట్లు ముద్రించకపోవడంతో నగదు కొరత ఏర్పడింది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోను దీని తీవ్రత పెరిగింది’ అని ఎన్‌వైటీ వివరించింది.

ఎక్కడా ఇలాంటిది ఉండదు..
కొన్ని వారాల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తాన్ని రద్దు చేసేస్తే.. ఏ ఆర్థిక వ్యవస్థా కూడా తీవ్ర ఇబ్బందులకు గురికాకుండా ఉండదని ఎన్‌వైటీ పేర్కొంది. ముఖ్యంగా భారత్‌లో పరిమాణంపరంగా వినియోగదారుల లావాదేవీల్లో ఏకంగా 98 శాతం నగదుపైనే ఆధారపడి ఉంటాయని, అలాంటి దేశంలో ఈ తరహా ప్రయోగంతో ప్రజలకు కష్టాలు తప్పవని తెలిపింది. డీమోనిటైజేషన్‌ కారణంగా ప్రజలు డెబిట్‌ కార్డులు, స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు సిద్ధపడినా.. చాలామటుకు వ్యాపార సంస్థల్లో ఈ తరహా ఎలక్ట్రానిక్‌ చెల్లింపులకు తగిన సదుపాయాలు లేవని ఎన్‌వైటీ వివరించింది. పైపెచ్చు డీమోనిటైజేషన్‌ అంశం.. ప్రస్తుతం అవినీతిని అంతమొందించడానికి గానీ.. భవిష్యత్‌లో మళ్లీ పుష్కలంగా నగదు అందుబాటులోకి వచ్చాక మళ్లీ అవినీతికి ఆస్కారం ఉండదనడానికి గానీ  తగిన ఆధారాల్లేవని పేర్కొంది.

ప్రజలు సహనం కోల్పోతారు..
అవినీతిపై పోరులో తమకు కొంత కష్టం ఎదురైనా భరించేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పటికీ.. ఎంతో కాలం వారు ఓపిక పట్టలేకపోవచ్చని ఎన్‌వైటీ తెలిపింది. ఆర్థికవేత్తల అంచనాల ప్రకారం కరెన్సీ కష్టాలు ఇలాగే కొనసాగినా.. అవినీతి, పన్ను ఎగవేతలు తగ్గకపోయినా వారు సహనం కోల్పోవచ్చని హెచ్చరించింది. పెద్ద నోట్ల రద్దును విమర్శిస్తూ ఎన్‌వైటీ సంపాదకీయం ప్రచురించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు