పారిశ్రామికోత్పత్తి వృద్ధి పెరిగింది..?

13 Jan, 2017 01:50 IST|Sakshi
పారిశ్రామికోత్పత్తి వృద్ధి పెరిగింది..?

నవంబర్‌లో 5.7 శాతం
లెక్కలను విడుదల చేసిన కేంద్ర గణాంకాల శాఖ
కనిపించని నోట్ల రద్దు ప్రభావం
తయారీ, మైనింగ్, విద్యుత్‌ రంగాల దన్ను
క్యాపిటల్‌ గూడ్స్‌దీ అప్‌ట్రెండే..!


న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీనితో పారిశ్రామికవృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందన్న భయాలు నెలకొన్నాయి. అయితే ఇలాంటిదేమీ లేదని కేంద్ర గణాంకాల శాఖ నవంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి గణాంకాలు వెల్లడించాయి. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 5.7 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. సూచీలో దాదాపు 78 శాతం వాటా కలిగిన తయారీరంగం సహా మైనింగ్, విద్యుత్, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలు మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు వెల్లడించాయి. కాగా 2016 అక్టోబర్లో ఐఐపీ వృద్ధి అసలు లేకపోగా (–)1.8 శాతం క్షీణత నమోదయ్యింది.

బేస్‌ ఎఫెక్టే కారణమా?
2015 నవంబర్‌ ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా (–) 3.4 శాతం క్షీణత నమోదయ్యింది (2014 నవంబర్‌ ఉత్పత్తి విలువతో పోల్చితే). 2015 నవంబర్‌లో అసలు వృద్ధిలేకపోవడం వల్ల దానితో పోల్చి 2016 నవంబర్‌లో ఏ కొంచెం విలువ వృద్ధి నమోదయినా... అది శాతాల్లో అధికంగా ఉంటుందన్నది గమనార్హం. దీనినే బేస్‌ ఎఫెక్ట్‌గా పరిగణిస్తారు.

ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకూ చూస్తే... పారిశ్రామిక వృద్ధి 0.4 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 3.8 శాతం.

వృద్ధి పుంజుకుంటుంది: ఫిక్కీ
తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక వేదిక ఫిక్కీ ఒక నివేదిక విడుదల చేస్తూ... భవిష్యత్తుపై విశ్వాస ధోరణిని వ్యక్తం చేసింది. ‘‘పలు బ్యాంకుల వడ్డీరేట్లు తగ్గించాయి. దీనితో వినియమ, పెట్టుబడుల డిమాండ్‌ పెరుగుతుంది. రానున్న నెలల్లో తయారీ రంగం వృద్ధికి దోహదపడే చర్య ఇది. వడ్డీరేట్ల విషయమై ఆర్‌బీఐ మరింత సరళతర విధానాన్ని అవలంభిస్తుందని భావిస్తున్నాం. దీనితో వృద్ధి మరింత పుంజుకుంటుంది’’ అని ఫిక్కీ తన ఈ ప్రకటనలో పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు