పీసీ, మొబైల్స్ విక్రయాలు తగ్గుతాయ్..

12 Dec, 2016 15:14 IST|Sakshi
పీసీ, మొబైల్స్ విక్రయాలు తగ్గుతాయ్..

ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 25% డౌన్
స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 17.5% తగ్గుదల
మూడో త్రైమాసికంలో నోట్ల రద్దు ప్రభావంపై ఐడీసీ అంచనా
ఎలక్ట్రికల్ వాహన రంగానికీ దెబ్బే

 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం పర్సనల్ కంప్యూటర్లు (పీసీ), మొబైల్స్ విక్రయాలు, ఎలక్ట్రికల్ వాహన రంగాలపై పెను ప్రభావమే చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో పీసీ, మొబైల్స్ విక్రయాలు గణనీయంగా తగ్గిపోతాయని మార్కెట్ పరిశోధనా సంస్థ ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్’ (ఐడీసీ) తెలిపింది. మరీ ముఖ్యంగా నగదుపై ఎక్కువగా కొనుగోళ్లు జరిగే గ్రామీణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువే ఉంటుందని వివరించింది. దుకాణాల్లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ పీసీ, మొబైల్స్ విక్రయాల డిమాండ్ బాగానే తగ్గుతుందని ఈ సంస్థ పేర్కొంది. ఆన్‌లైన్ విభాగంలో క్యాష్ ఆన్ డెలివరీ లావాదేవీలు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది.

సెప్టెంబర్ త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ల విక్రయాలు 3.99 కోట్లు,  స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్లు 3.23 కోట్లుగా ఉండగా... డిసెంబర్ త్రైమాసికంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు 25 శాతం, స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 17.5 శాతం తగ్గుతాయని ఐడీసీ ఇండియా మార్కెట్ అనలిస్ట్ జైపాల్‌సింగ్ తెలిపారు. ట్యాబ్లెట్ల విక్రయాలు క్రితం త్రైమాసికంలో 10 లక్షలు ఉండగా, డిసెంబర్ త్రైమాసికంలో 23 శాతం క్షీణించనున్నట్టు ఈ సంస్థ అంచనా వేసింది. ‘‘రిటైల్, ఎక్స్‌క్లూజివ్ దుకాణాల్లో కంప్యూటర్ల కొనుగోళ్లు సగానికిపైగా నగదు రూపంలో జరుగుతారుు. నోట్ల రద్దు  నేపథ్యంలో ఈ మార్కెట్ డిసెంబర్ త్రైమాసికంలో 33 శాతం క్షీణిస్తుందని అంచనా వేస్తున్నట్టు’’ ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మనీష్ యాదవ్ తెలిపారు. పండుగల సీజన్ అనంతరం సాధారణంగానే విక్రయాలు తగ్గుతాయని, నోట్ల రద్దు చర్యతో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని ఐడీసీ వివరించింది. వచ్చే త్రైమాసికం మధ్య కాలం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.

ఎలక్ట్రిక్ వాహనరంగంపై దెబ్బ
డీమోనటైజేషన్ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. రుణ సదుపాయం లేకుండా ఈ వాహనాలను నగదుపైనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నందున నోట్ల రద్దు ప్రభావం గణనీయంగా ఉంటుందని తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన తయారీదారుల సొసైటీ (ఎస్‌ఎంఈవీ) స్పందిస్తూ... ఈ రంగం ప్రారంభస్థారుు వాహనాలను ఎక్కువగా తయారు చేస్తోందని, వీటిని ప్రజలు నగదుపై కొనుగోలు చేస్తున్నారని, వారికి ఎటువంటి బ్యాంకు రుణ సదుపాయం లేదని పేర్కొంది. ప్రభుత్వ చర్యతో విక్రయాలు బాగా తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అరుుతే, నోట్ల రద్దు అనేది మంచి చర్య అని, నల్లధనం నియంత్రణ దిశగా ఇదో అడుగు అని ఎస్‌ఎంఈవీ పేర్కొంది.

>
మరిన్ని వార్తలు