జీడీపీ వృద్ధి మీద ప్రభావం పడొచ్చు: ఫిచ్

22 Nov, 2016 14:05 IST|Sakshi
జీడీపీ వృద్ధి మీద ప్రభావం పడొచ్చు: ఫిచ్
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం వల్ల ఇప్పుడు తలెత్తిన ఇబ్బందులు దీర్ఘకాలం కొనసాగితే మాత్రం.. దానివల్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మీద ప్రభావం పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న  ఫిచ్ రేటింగ్స్ సంస్థ తెలిపింది. బ్యాంకుల నుంచి నోట్లను ఉపసంహరించుకోవడం వల్ల ఒక్కసారిగా నిధులకు కొరత వచ్చిందని, దానివల్ల ఆర్థిక కార్యకలాపాలు దాదాపు స్తంభించాయని ఫిచ్ తెలిపింది. పెద్ద డినామినేషన్ ఉన్న నోట్లను రద్దు చేయడం వల్ల తాత్కాలికంగా భారత ఆర్థిక వ్యవస్థకు అంతరాయం ఏర్పడినట్లు వివరించింది. పెద్ద నోట్ల రద్దు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను వీలైనంత త్వరగా పరిష్కరించుకుంటే ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉండకపోవచ్చన్నది ఫిచ్ సలహా. 
 
ఇందుకోసం ప్రధానంగా 500 రూపాయల కొత్త నోట్లు మార్కెట్లలోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం 2000 రూపాయల నోట్లు కొంతవరకు అందుబాటులో ఉన్నా, చాలావరకు వీటికి చిల్లర దొరకడం పెద్ద సమస్యగా మారింది. వెయ్యి రూపాయల బిల్లు అయ్యేచోట ఈ 2000 నోటు ఇచ్చినా, వాళ్లు మళ్లీ తిరిగి పాత 500 రూపాయల నోట్లు ఇస్తున్నారు. దాంతో మళ్లీ వాటిని మార్చుకోడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. అదే 500 రూపాయల నోట్లు విస్తృతంగా అందుబాటులోకి వస్తే ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోయి మళ్లీ చిన్న వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. 
>
మరిన్ని వార్తలు