అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

23 Jul, 2019 14:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వ్యాపార దిగ్గజ సోదరులుగా ఘనతకెక్కిన ముకేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ వ్యాపార సామ్రాజ్యాల మనుగడ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ముకేష్‌ అంబానీ కంపెనీల బ్రాండ్‌ విలువ పెరుగుతూ పోతుంటే మరోపక్క అనిల్‌ అంబానీ కంపెనీల బ్రాండ్‌ విలువ రోజు రోజుకు తరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్‌ గ్రూప్‌ బ్రాండ్‌ విలువ గతేడాది కన్నా ఈ ఏడాది మరింత పడిపోయింది. ఇప్పుడు ఈ బ్రాండ్‌ విలువ 65 శాతం తగ్గి 3, 848 రూపాయలకు పడిపోయింది. దాంతో అనిల్‌ అంబానీ కంపెనీల గ్రూప్‌ బాండ్‌ భారత్‌లో 56వ స్థానానికి చేరుకుంది. 2018లో ఉన్న స్థానంతో పోలిస్తే ఏకంగా 28 ర్యాంకులు తగ్గింది.

లండన్‌లోని ‘ఇండిపెండెంట్‌ స్ట్రాటజీ కన్సల్టెంట్‌’ ఇటీవల విడుదల చేసిన ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా–100’ జాబితాలో మొదటి స్థానాన్ని టాటా గ్రూప్‌ దక్కించుకుంది. రిలయెన్స్‌ కమ్యూనికేషన్స్‌ సహా రిలయెన్స్‌ గ్రూపులోని అన్ని కంపెనీల బ్రాండ్‌ విలువ పడిపోతుండడంతో మొత్తం కంపెనీల గ్రూప్‌పై దాని ప్రభావం పడుతోంది. ప్రస్తుతం రిలయెన్స్‌ కమ్యూనికేషన్లలో చెల్లింపుల పర్వం కొనసాగుతోంది. ‘నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌’ ముందు ఈ కంపెనీ ఎన్నో కేసులను ఎదుర్కొంటున్నది. స్వీడన్‌ టెలికమ్‌ పరికరాల కంపెనీ ‘ఎరిక్‌సన్‌’కు బకాయిలను చెల్లించడంలో ముకేష్‌ అంబాని సహకరించి ఉండక పోయినట్లయితే అనిల్‌ అంబానీ జైలుకు కూడా వెళ్లేవాడు. అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన ‘ఆర్‌ పవర్‌’ విద్యుత్‌ సంస్థ, ‘రిలయెన్స్‌ నావల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌’, ‘రిలయెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ సంస్థలన్నీ నష్టాల్లోనే నడుస్తున్నాయి.

ఇందుకు పూర్తి భిన్నంగా ముకేష్‌ అంబానీ సారథ్యంలోని ‘రిలయెన్స్‌ జియో’ 360 కోట్ల డాలర్ల బ్రాండ్‌ విలువతోని ‘బ్రాండ్‌ ఫైనాన్స్‌ ఇండియా–100’ జాబితాలో 14వ స్థానాన్ని ఆక్రమించుకుంది. అతి తక్కువ ధర వ్యూహంతోనే ఆ కంపెనీ అతి ఎక్కువ బ్రాండ్‌ విలువను పెంచుకోగలిగింది. టాటా గ్రూప్‌ వరుసగా రెండో ఏడు కూడా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 1960 కోట్ల డాలర్ల విలువతో ఇది అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత స్థానాల్లో ఎల్‌ఐసీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, మహీంద్రా సంస్థలు కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు