ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్‌ ఆప్షన్‌ ఓకేనా?

26 Dec, 2016 01:43 IST|Sakshi
ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్‌ ఆప్షన్‌ ఓకేనా?

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. వీటికి లాక్‌ ఇన్‌ పీరియడ్‌ మూడేళ్లు కాబట్టి... ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదా లేకుంటే సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయమంటారా?
–సురేశ్, విశాఖపట్టణం

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)ల్లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల.. పన్ను ప్రయోజనాలతో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులను కూడా పొందవచ్చు. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో లాగానే ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో కూడా సిప్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలోనే ఇన్వెస్ట్‌ చేయడం సముచితం. ఒకవేళ మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులుంటే వాటిని నెలకి కొంత మొత్తంగా విభజించి సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. మీరు ఇన్వెస్ట్‌ చేసినప్పుడు ఈక్విటీ మార్కెట్‌ గరిష్ట స్థాయిలో ఉండి, . 

ఆ తర్వాత పతనమైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగం హరించుకుపోతుంది. ఈ రిస్క్‌ ఉండకూడదనుకుంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిప్‌ విధానంలోనే ఇన్వెస్ట్‌ చేయడం మంచిది. సాధారణంగా చాలా మంది పన్ను ఆదా నిమిత్తం ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తారు. కానీ ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా సంపద సృష్టించుకోవచ్చు కూడా. కనీసం 5 నుంచి ఏడేళ్ల పాటు ఈఎల్‌ఎస్‌ఎస్‌ల్లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు.

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్‌ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను లేనందున డివిడెండ్‌ ఆప్షన్‌ ను ఎంచుకోవాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? – స్పందన, హైదరాబాద్‌
మీ నిర్ణయం సరైనది కాదు.  కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్‌  ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. మీకు క్రమానుగతంగా డబ్బులు అవసరమైతేనే మీరు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు, రిటైరైన తర్వాత మీకు వైద్య, ఇతర ఖర్చుల కోసం నెలా నెలా కొంత మొత్తం డబ్బులు అవసరమవుతాయి. ఇలాంటి సందర్బాల్లోనే డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే డివిడెండ్‌ చెల్లింపు మొత్తాన్ని కూడా మళ్లీ ఇన్వెస్ట్‌ చేస్తారు.

కాబట్టి, చక్రగతి వృద్ధితో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులు వస్తాయి. అలా కాకుండా డివిడెండ్‌ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకోండి. వచ్చే డివిడెండ్‌లు స్వల్పంగా ఉంటాయి. వీటిని ఖర్చు చేయడమో, లేకుంటే స్వల్పరాబడి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడమో జరుగుతుంది. ఇవి అలా వృ«థా అయిపోతాయి. ఈక్విటీ ఫండ్స్‌ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు లేవు. ఏడాది తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ను విక్రయిస్తే, ఎలాంటి మూలధన లాభాల పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకని కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్‌  ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది.

నా ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్‌) ఖాతాను రెండు దఫాలుగా పదేళ్లపాటు పొడిగించాను. ఇలా పొడిగించిన తర్వాత పీపీఎఫ్‌ ఖాతాపై వచ్చే రాబడులపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉందా? – రాజేశ్, బెంగళూరు  
రెండు దఫాలుగా పొడిగించిన తర్వాత కూడా మీ పీపీఎఫ్‌ ఖాతా రాబడులపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను పరంగా పీపీఎఫ్‌ను 3ఈ ఎగ్జెంప్ట్‌(మినహాయింపు)–ఎగ్జెంప్ట్‌–ఎగ్జెంప్ట్‌)గా వ్యవహరిస్తారు. అంటే మూడు దశల్లో(ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు–మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ వృద్ధి చెందేటప్పుడు–ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు) పన్ను మినహాయింపులుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ చేసే దశలో పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. పీపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి పన్ను భారం ఉండదు. ఇక మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉపసంహరించుకునేటప్పుడు కూడా మీపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మెచ్యురిటీ తీరిన తర్వాత పొడిగించిన పీపీఎఫ్‌ ఖాతాలకు కూడా ఇదే వర్తిస్తుంది.

ప్రస్తుతం నా వయస్సు 52 సంవత్సరాలు. ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. వడ్డీరేట్లు పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలానికి ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సరైనదేనా? – జాన్సన్, విజయవాడ

ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ సిక్స్‌ అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్‌. మీరు వన్‌టైమ్‌ ప్రీమియమ్‌ చెల్లించారనుకోండి. మీరు బతికున్నంత కాలం మీకు నెలవారీ లేదా సంవత్సరానికొకసారి కొంత మొత్తం చెల్లిస్తారు. మీరు చెల్లించిన ప్రీమియమ్‌ను తిరిగి పొందే ఆప్షన్‌ కూడా ఉంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీకు నెలవారీ వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్‌ చేయాలనే దానిపై  గరిష్ట పరిమితి లేదు. చెల్లింపులు ఎలా కావాలనుకుంటే అలా (నెలవారీ, మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి, ఏడాదికొకసారి) ఎంచుకోవచ్చు. ఇలాంటి సంప్రదాయ పెన్షన్‌ ప్లాన్‌లకు దూరంగా ఉండడమే మంచిది. ఇవి ఖరీదైనవి.  ఈ తరహా ప్లాన్‌ల్లో పారదర్శకత ఉండదు. సీనియర్‌ సిటిజెన్‌ సేవింగ్స్‌ స్కీమ్, లేదా పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లతో పోల్చితే ఈ స్కీమ్‌లో వచ్చే రాబడి తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు