కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

29 Jun, 2020 08:28 IST|Sakshi

నేను ప్రతి నెలా కొంత మొత్తం యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. ఇది మంచి ఫండేనా? దీంట్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? –లావణ్య, విశాఖపట్టణం  
యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌... ఆ కేటగిరీలోని అత్యుత్తమ ఫండ్స్‌లో ఒకటి. సాధారణంగా బ్లూచిప్‌ ఫండ్స్‌ అన్నీ మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న లార్జ్‌ క్యాప్‌ కంపెనీ షేర్లలోనే ఇన్వెస్ట్‌ చేస్తాయి. గత ఐదేళ్లలో ఈ ఫండ్‌ సగటు రాబడి 8 శాతంగా ఉంది. గత ఏడాది కాలంలో ఈ ఫండ్‌ 4 శాతం మేర నష్టపోయింది. ఇదే కాలానికి బీఎస్‌ఈ 100 సూచీ 11 శాతం మేర నష్టపోయింది. ఇక గత ఆర్నెల్లలో ఈ ఫండ్‌ ఒకింత రికవరీ అయింది. మంచి వృద్ధి అవకాశాలున్న అత్యున్నత స్థాయి నాణ్యత గల కంపెనీల్లోనే ఈ ఫండ్‌ ఇన్వెస్ట్‌ చేస్తోంది. మార్కెట్‌ పుంజుకుంటే, ఈ ఫండ్‌ రాబడులు మరింతగా పెరుగుతాయి. ఈ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి.  

షేర్లకు, బాండ్లకు మధ్య తేడా ఏమిటి? కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? –ఫయాజ్, విజయవాడ  
కంపెనీ యాజమాన్యంలో భాగస్వామ్యంగా గల వాటాలనే షేర్లుగా పరిగణిస్తారు. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ల ట్రేడింగ్‌లో ఈ షేర్ల క్రయ, విక్రయాలు జరుపుకోవచ్చు. సాధారణంగా ఇన్వెస్టర్లు దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న షేర్లను కొనుగోలు చేస్తారు. షేర్‌ ధరల్లో వృద్ధి, బోనస్‌ షేర్లు, డివిడెండ్‌లు...తదితర ప్రయోజనాలు లభిస్తాయి. ఇక  బాండ్ల జారీ ద్వారా కంపెనీ రుణాలను సమీకరిస్తుంది.  ఈ బాండ్లకు కాలపరిమితి, వడ్డీరేటు ఉంటుంది. బ్యాంక్‌ డిపాజిట్టులాంటిదే కంపెనీ బాండ్‌ కూడా. అయితే బ్యాంక్‌ డిపాజిట్లలాగా బాండ్లు సురక్షితమనే విషయం.. మీరు ఇన్వెస్ట్‌ చేసే కంపెనీపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా కంపెనీ ఎంత పటిష్టమో అనే విషయాన్ని బట్టే ఆ కంపెనీ బాండ్ల నష్టభయం ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న కంపెనీ తన బాండ్లపై తక్కువ వడ్డీనే ఇవ్వవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ సురక్షితంగా ఉంటాయనే ధీమానే దీనికి కారణం. ఇక ఆర్థిక స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉన్న కంపెనీ అధిక వడ్డీరేటును ఆఫర్‌ చేయవచ్చు. కానీ ఇలాంటి కంపెనీల బాండ్లకు నష్ట భయం అధికంగా ఉంటుంది. కంపెనీ ఆర్థిక స్థితిగతులను కూలంకషంగా మదింపు చేసిన తర్వాతే కంపెనీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలి.

ధీరేంద్ర కుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా