ఈ వారంలో రెండు ఐపీవోలు

4 Sep, 2017 00:51 IST|Sakshi
ఈ వారంలో రెండు ఐపీవోలు

రూ.1,200 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఈ వారంలో డిక్సన్‌ టెక్నాలజీస్, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ ఐపీవోలు నిధుల సమీకరణకు ప్రజల ముందుకు రానున్నాయి. ఈ రెండు ఐపీవోలు 6వ తేదీ మొదలై 8వ తేదీతో ముగుస్తాయి. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ అయిన డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఒక్కో షేరుకు రూ.1,760–1,766 ధరల శ్రేణి నిర్ణయించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో 30,53,675 షేర్లతోపాటు రూ.60 కోట్ల విలువైన తాజా షేర్లను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. ఐపీవో ద్వారా రూ.600 కోట్లను సమీకరించనుంది. ఈ నిధులను తిరుపతిలో ఎల్‌ఈడీ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు, ఎల్‌ఈడీ లైటింగ్‌ ఉత్పత్తులు, ఐటీ సామర్థ్యాల బలోపేతానికి, రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.

 ఐడీఎఫ్‌సీ బ్యాంకు, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్, యెస్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. రహదారుల నిర్మాణ సంస్థ అయిన భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ ఒక్కో షేరుకు రూ.195–205ను ధరల శ్రేణిగా నిర్ణయించింది. ఐపీవోలో మొత్తం 2.93 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించనుంది. శ్రేయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌కు ఇది అనుబంధ కంపెనీ. ఐపీవో ద్వారా రూ.600 కోట్ల వరకు నిధుల సమీకరణ చేయనుంది. ఇంగా క్యాపిటల్, ఇన్వెస్టెక్‌ క్యాపిటల్‌ సర్వీసెస్, శ్రేయి క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఐపీవోకు మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్‌ అవుతాయి.

మరిన్ని వార్తలు