‘డిజిటల్‌’ డిస్కౌంట్‌పై కోత!

16 Aug, 2018 06:40 IST|Sakshi

0.75 నుంచి 0.25 శాతానికి కుదింపు

లీటర్‌ పెట్రోల్‌పై ఆదా 20 పైసలే

అయినా తగ్గని స్వైపింగ్‌ లావాదేవీలు  

సాక్షి, సిటీబ్యూరో: పెట్రో ‘డిజిటల్‌’ డిస్కౌంట్‌పై కోత పడింది. డిజిటల్‌ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ 0.75 నుంచి 0.25 శాతానికి కుదింపునకు గురైంది. అయినా పెట్రోల్, డీజిల్‌  నగదు రహిత లావాదేవీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. పెట్రోల్‌ బంకుల్లో సర్వీస్‌ చార్జీలు లేని కారణంగా వినియోగదారులు నగదు రహిత లావాదేవీలపైనే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 2016 నవంబర్‌లో డీమానిటైజేషన్‌ నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో  క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు, ఈ– వ్యాలెట్, మొబైల్‌ ఇతరత్రా నగదు రహిత  సదుపాయాల ద్వారా చెల్లింపులపై చమురు సంస్థలు రాయితీ ప్రకటించిన విషయం విదితమే.

లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై 0.75 శాతం డిస్కౌంట్‌ వర్తింపజేసి నగదు రహిత లావాదేవీలు జరిపిన  వినియోగదారులు బ్యాంక్‌ ఖాతాలో మూడు రోజుల్లో రాయితీ జమయ్యేలా చర్యలు చేపట్టింది. ఏటీఎంలలో  నగదు ఇబ్బందుల కారణంగా  ప్రధాన ఆయిల్‌ కంపెనీలైన ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌ పెట్రోల్‌ బంకుల్లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేపట్టారు. పెట్రోల్‌ బంకులో డిజిటల్‌ చెల్లింపులపై సేవా పన్ను మినహాయించడంతో వినియోగదారులు దానికి అలవాటుపడ్డారు. తాజాగా చమురు సంస్థలు నగదు రహిత లావాదేవీలపై రాయితీ 0.25 శాతానికి కుదించి వేసింది. ఈ నిర్ణయం ఈ నెల ఒకటి నుంచే అమల్లోకి వచ్చింది.

లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసలు జమ..  
పెట్రోల్‌ బంకుల్లో డిజిటల్‌ చెల్లింపు ద్వారా పెట్రోల్, డీజిల్‌ కొనుగోళ్లు చేస్తే లీటర్‌పై బ్యాంక్‌ ఖాతాలో జమయ్యేది అక్షరాల ఇరవై పైసలే. గ్రేట ర్‌ పరిధిలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 81.75 పైసలు ఉండగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా  లీటర్‌పై లభించే రాయితీ అక్షరాలా ఇరవై పైసలు. డీజిల్‌ ధర రూ.74.55 పైసలు ఉండగా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 18 పైసలు డిస్కౌంట్‌గా లభిస్తోంది.  మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉన్నాయి. ప్రతి రోజు సగటున 40 నుంచి 50 లక్షల లీటర్ల పెట్రో ల్, 30 నుంచి 40 లక్షల డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. నగరంలో 55 లక్షల వివిధ రకాల వాహనాలకు తోడు ఇతర ప్రాంతాల నుం చి  హైదరాబాద్‌కు  రాకపోకలు సాగించే సుమా రు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి. పెట్రోల్, డీజిల్‌  కొనుగోళ్లపై రాయితీ తగ్గించినా స్వైపింగ్‌ ద్వారా కొనుగోలు మాత్రం తగ్గు ముఖం పట్టలేదు.

మరిన్ని వార్తలు