ఫార్మా ఎగుమతులకు కష్టకాలమే!

30 Sep, 2017 00:55 IST|Sakshi

అంతర్జాతీయంగా బలహీన ఆర్థిక స్థితులు 

ఎగుమతులపై నెగెటివ్‌ ధోరణికి అవకాశం 

రేటింగ్‌ ఏజెన్సీ ఇండ్‌–రా నివేదికలో వెల్లడి  

ముంబై: అంతర్జాతీయంగా బలహీన ఆర్థిక పరిస్థితులు దేశీ ఫార్మా ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. మధ్యకాలికంగా వృద్ధి దెబ్బతినే అవకాశం ఎక్కువే ఉంది. తాజా నివేదికలో రేటింగ్‌ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌–రా) ఈ అంశాలు వెల్లడించింది. ‘ఆఫ్రికాలో బలహీన ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, లాటిన్‌ అమెరికాలో కరెన్సీ ఒడిదుడుకులు తదితర అంశాలతో ఫార్మా ఉత్పత్తుల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

ఫలితంగా భారత ఫార్మా ఎగుమతులపై మధ్యకాలికంగా ఒత్తిడి ఉండొచ్చు‘ అని తెలిపింది. 2014 ఆర్థిక సంవత్సరం దాకా ఒక మోస్తరు నియంత్రణలు గల మార్కెట్లకు భారీగా పెరిగిన దేశీ సంస్థల ఫార్మా ఫార్ములేషన్స్‌ ఎగుమతులు గత కొన్నాళ్లుగా బలహీన గణాంకాలను నమోదు చేస్తున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఆర్థిక, రాజకీయ అనిశ్చితితో స్థానిక కరెన్సీలు బలహీనపడటంతో ఆయా మార్కెట్లకు ఎగుమతులు తగ్గాయని ఇండ్‌–రా తెలిపింది. మధ్యప్రాచ్య దేశాల్లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో పాటు గల్ఫ్‌ కో–ఆపరేషన్‌ కౌన్సిల్‌ దేశాల్లో బీమాను తప్పనిసరి చేస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో మధ్యప్రాచ్యానికి ఎగుమతులు 33 శాతం వృద్ధి చెందాయి.


ఎగుమతుల క్షీణత..: ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల్లో బలహీన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎగుమతుల్లో తగ్గుదల కొనసాగుతుందని, స్వల్ప..మధ్యకాలికంగా ఆసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఒక మోస్తరుగా వృద్ధి ఉండొచ్చని ఇండ్‌–రా వివరించింది.

చాలా మటుకు దేశీ ఎగుమతి సంస్థలు.. సెమీ రెగ్యులేటెడ్‌ మార్కెట్లలో తమ కార్యకలాపాల్ని క్రమబద్ధీకరించుకుంటున్నాయని, అవకాశాల కన్నా రిస్కులు ఎక్కువగా ఉన్న మార్కెట్లకు దూరంగా ఉంటున్నాయని పేర్కొంది. వెనిజులన్‌ బొలివర్‌ మారకం విలువను 2014 మార్చి నుంచి 32 శాతం మేర తగ్గించేసిన నేపథ్యంలో వెనిజులాకు ఎగుమతులు పరిమితంగా ఉంటున్నా యి. అటు రష్యా రూబుల్‌ కూడా భారీగా క్షీణించడంతో అక్కడికి కూడా ఎగుమతుల విషయంలో ఎగుమతిదారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.               

కాంతి రేఖలు..
గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నా.. సెమీ–రెగ్యులేటెడ్‌ మార్కెట్లకు సంబంధించి దీర్ఘకాలిక ఫండమెంటల్స్‌ పటిష్టంగానే ఉన్నాయి. అంతగా అభివృద్ధి చెందని ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా.. ఆసియా దేశాల్లో మొండి వ్యాధుల చికిత్స వ్యయాలు భారీగా ఉంటున్నందున.. జనరిక్స్‌ ఔషధాల వాడకానికి డిమాండ్‌ పెరుగుతుందని ఇండ్‌–రా తెలిపింది. అలాగే వర్ధమాన ఆసియా మార్కెట్లు, జీసీసీ దేశాల్లో సార్వత్రిక ఆరోగ్య బీమాకు ఆదరణ పెరుగుతుండటం వంటి అంశాలతో జనరిక్స్‌ వాడకం పెరిగి, ఆయా ఔషధాల తయారీ సంస్థలకు మధ్య, దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరనుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు