డిజిటల్ బీమా.. వైపరీత్యాల్లో ధీమా

19 Sep, 2016 02:12 IST|Sakshi
డిజిటల్ బీమా.. వైపరీత్యాల్లో ధీమా

వర్షాలు.. వరదలు ఇతరత్రా రూపాల్లో ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరీత్యాల ఉదంతాలు అనేకం కనిపిస్తున్నాయి. వీటి వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం గణనీయంగానే జరుగుతోంది. వాస్తవానికి ప్రకృతి వైపరీత్యాల మీద మనకెలాంటి నియంత్రణ లేకపోయినప్పటికీ.. వాటి బారి నుంచి మనకి కొంతైనా ఉపశమనం కల్పించే బీమా పాలసీల విషయంలో కాస్త ముందుచూపుతో ఉంటే తగు ప్రయోజనాలు పొందే వీలుంటుంది. సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు సాధ్యపడుతుంది.

పాలసీ క్లెయిమ్‌లకు సంబంధించి సమస్యలేమీ ఎదురవకుండా ఉండాలంటే.. ముందుగా ఆయా బీమా పాలసీల్లో వివిధ నిబంధనల గురించి తగినంత అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే పాలసీకి సంబంధించి మన హక్కులను పరిరక్షించుకునే వీలవుతుంది. ఈ దిశగా ఉపయోగకరమైన కొన్ని అంశాలివీ...


* ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో భద్రపరచటం మేలు  
* వీలైతే బీమా కంపెనీల సైట్లలోనే రిజిస్ట్రేషన్

 
ఆరోగ్య బీమా
జీవిత బీమా తరహాలోనే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పత్రాలను కూడా ప్రత్యేకంగా బీరువాల్లో దాచిపెట్టకుండా.. డిజిటల్ ఫార్మాట్‌లోనూ భ ద్రపర్చుకోవచ్చు. వర్తించే ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే, ఎంత ప్రకృతి వైపరీత్యాల్లాంటి సమయంలోనైనా హెల్త్ పాలసీ ప్రయోజనాలు పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే క్లెయిములను బీమా కంపెనీ తోసిపుచ్చే అవకాశం ఉంది. ఏదైనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన పక్షంలో దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఒకోసారి క్యాష్‌లెస్ హాస్పిటలైజేషన్ కుదరకపోయినప్పటికీ.. నిర్దేశిత నిబంధనలు పాటిస్తే, తర్వాత దశలో రీయింబర్స్‌మెంట్ అయినా పొందడానికి వీలవుతుంది.
 
జీవిత బీమా
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్‌ని సాధ్యమైతే ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో భద్రపర్చడం మంచిది. అలా కుదరకపోతే కనీసం పాలసీ నంబరునైనా ఎలక్ట్రానిక్ విధానంలో ఎక్కడో ఒక దగ్గర భద్రంగా ఉంచుకోవాలి. నిజానికిది చాలా సులువైన ప్రక్రియే. డాక్యుమెంట్ ను స్కాన్ చేసిన త ర్వాత మీ ఈమెయిల్ అకౌంట్‌లోనో లేదా ఆన్‌లైన్ డ్రైవ్‌లోనో స్టోర్ చేసుకోవచ్చు. సెర్చి ఇంజిన్ గూగుల్ ఇందుకోసం డాక్యుమెంట్స్, డ్రైవ్ వంటి సర్వీసులు అందిస్తోంది. జీమెయిల్ ఉంటే వీటిని ఉచితంగా కూడా వినియోగించుకోవచ్చు.

దీంతో పాటు పలు బీమా కంపెనీలు కస్టమర్లకు ఆన్‌లైన్ సౌకర్యాలు అందిస్తున్నాయి. అంటే పాలసీల్ని వీటిలో రిజిస్టరు చేసుకోవచ్చన్న మాట. ఒకసారి రిజిస్టరు చేసుకుంటే... ప్రీమియం చెల్లింపులు కూడా దీనిద్వారానే చేయొచ్చు. పాలసీ వివరాలతో పాటు చెల్లించిన రసీదులు కూడా దీన్లో భద్రంగా ఉంటాయి. దీంతో పాటు జీవిత బీమా పాలసీ తీసుకున్న సంగతిని పాలసీదారు తనపై ఆధారపడి ఉన్న కుటుంబసభ్యులకు/ నామినీలకు కచ్చితంగా తెలియజేయాలి. చాలా మంది ఈ విషయాన్ని గురించి వెల్లడించకుండా... పెద్ద తప్పు చేస్తుంటారు.

ఒకవేళ పాలసీదారుకు ఏదైనా అనుకోనిది జరిగితే.. లైఫ్ ఇన్సూరెన్స్ ఉందన్న సంగతి నామినీకి తెలియకపోతే కట్టిన ప్రీమియంలు, ప్రయాస అంతా వృధానే అవుతుంది. కాబట్టి, జీవిత బీమా కంపెనీ పేరు, పత్రం లేదా నంబరు, సమ్ ఇన్సూర్డ్, ప్రీమియం, వేలిడిటీ మొదలైన వివరాలన్నీ నామినికీ తెలియపర్చి ఉంచాలి. ప్రస్తుతం అన్ని జీవిత బీమా కంపెనీలు.. పాలసీలను డిజిటల్ ఫార్మాట్‌లో ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి. దీని వల్ల పేపర్లను పోగొట్టుకునే రిస్కులు తగ్గుతాయి.
 
సాధారణ బీమా
ఇతర పాలసీల మాదిరిగానే, జనరల్ ఇన్సూరెన్స్ విషయంలోనూ నిర్దిష్ట జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాల వల్ల మీ మోటార్‌సైకిలు, కారు, ఇల్లు లేదా వ్యాపారాలకు నష్టం వాటిల్లి క్లెయిమ్ పొందాలనుకుంటే.. సదరు ఘటన జరిగిన రెండు, మూడు రోజుల్లోగానే బీమా కంపెనీకి తెలియజేయాలి.

ప్రకృతి వైపరీత్య పరిస్థితుల్లో పాలసీ కింద ఎంత మేరకు, ఏయే సమస్యలకు కవరేజి ఉంటుందో ముందుగానే నిబంధనలు తెలుసుకుని ఉండాలి. చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు మరికొన్ని ఉన్నాయి. రిస్కు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు అధిక ప్రీమియంలు కట్టాల్సి రావొచ్చు. ఇక ప్రైవేట్‌దైనా, ప్రభుత్వ రంగంలోనిదైనా.. బీమా కంపెనీని ఎంచుకునే ముందు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో సదరు సంస్థ ట్రాక్ రికార్డును కూడా పరిశీలించుకుని నిర్ణయం తీసుకోవడం శ్రేయస్కరం.

మరిన్ని వార్తలు