ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

23 Jul, 2019 12:14 IST|Sakshi

2021 నాటికి 5.1 బిలియన్‌

డాలర్లకు చేరుతుందని అంచనా

పెరుగుతున్న ఇంటర్నెట్‌ వినియోగంతో ఊతం

ఫిక్కీ–ఈవై నివేదికలో వెల్లడి

ముంబై: ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డిజిటల్‌ మీడియా ఇతరత్రా ప్రింట్, సినిమా మాధ్యమాలను అధిగమించనుంది. 2019లో సినిమా పరిశ్రమను, 2021 నాటికి ప్రింట్‌ మీడియాను దాటేయనుంది. 2021 నాటికి 5.1 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019లో డిజిటల్‌ మీడియా 3.2 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంటుందని ఇందులో అంచనా వేశారు. ఇక 2018లో 2.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న సినిమా సెగ్మెట్‌ ఈ ఏడాది 2.8 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని, గతేడాది 4.4 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ప్రింట్‌ మీడియా 2021 నాటికి 4.8 బిలియన్‌ డాలర్లకు చేరగలదని ఫీక్కీ–ఈవై నివేదిక అంచనా వేసింది. డిజిటల్‌ మీడియా గతేడాది 42 శాతం వృద్ధి చెంది 2.4 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారతీయులు ఫోన్‌పై సగటున 30 శాతం సమయాన్ని వినోదానికి వెచ్చిస్తున్నారని నివేదికలో వెల్లడైంది.

57 కోట్ల మంది నెట్‌ వినియోగదారులు..
చైనా తర్వాత ప్రస్తుతం భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్‌ యూజర్లు దాదాపు 57 కోట్ల మంది ఉన్నారు. ఏటా ఈ సంఖ్య 13 శాతం పెరుగుతోంది. ఆన్‌లైన్‌ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 32.5 కోట్లు, ఆడియో స్ట్రీమింగ్‌ యూజర్స్‌ సంఖ్య 15 కోట్ల స్థాయిలో ఉంది. 2021 నాటికి ఓవర్‌ ది టాప్‌ వీడియో సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 3–3.5 కోట్ల దాకా, ఆడియో సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 60–70 లక్షల దాకా పెరుగుతుందని ఫిక్కీ–ఈవై అంచనా వేసింది. టెలికం ఆపరేటర్లు కొత్తగా మల్టీ–సిస్టమ్‌ ఆపరేటర్ల అవతారమెత్తుతారని పేర్కొంది. ‘ప్రస్తుతం మొత్తం వినియోగంలో 60 శాతం వాటా టెలికం సంస్థల ద్వారా ఉంటోంది. ఇది 2021 నాటికి 75 శాతానికి .. 37.5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌ స్థాయికి చేరుతుంది‘ అని ఫిక్కీ–ఈవై తెలిపింది. మరోవైపు, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ టారిఫ్‌ ఆర్డరుతో ఓటీటీ, టీవీ ప్రసారాల సంస్థల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గి.. ఓటీటీ సంస్థలకు లబ్ధి చేకూరవచ్చని వివరించింది.

నివేదికలో మరిన్ని వివరాలు
గతేడాది దేశీయంగా మొత్తం మీడియా, వినోద రంగం పరిమాణం 23.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2017తో పోలిస్తే 13.4% వృద్ధి. 2021 నాటికి 33.6 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని అంచనా.
2018–21 మధ్య కాలంలో ఈ వృద్ధికి ఆన్‌లైన్‌ గేమింగ్, డిజిటల్‌ మీడియా ఊతంగా ఉండనున్నాయి. విభాగాలవారీ ఆదాయాలపరంగా టీవీ అగ్రస్థానంలో కొనసాగుతుంది.
2017లో 18.3 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 2018లో 27.8 కోట్లకు ఎగబాకింది.  
టీవీ రంగం 2018లో 12 శాతం వృద్ధితో 10.6 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరింది. 2021 నాటికి ఇది 13.7 బిలియన్‌ డాలర్లకు చేరనుంది.

మరిన్ని వార్తలు