స్థూల ఆర్థిక గణాంకాలతోనే దిశా నిర్దేశం..

31 Dec, 2018 03:52 IST|Sakshi

సోమవారం మౌలిక రంగ ఉత్పత్తి డేటా

ఈవారంలోనే నికాయ్‌ గణాంకాల వెల్లడి

ముడిచమురు, రూపాయి కదలికలపై దృష్టి

నవంబర్‌ ఆటో అమ్మకాల డేటా ఈవారంలోనే..

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాల వెల్లడి ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముడిచమురు, రూపాయి కదలికల ఆధారంగా నూతన ఏడాది మొదటివారం ట్రెండ్‌ ఆధారపడి ఉందని చెబుతున్నారు. ‘భూగోళ రాజకీయ అంశాలు, అధిక స్థాయిల వద్ద కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి, వాణిజ్య యుద్ధాలు వంటి ప్రతికూలతల నేపథ్యంలో మార్కెట్లలో నెగటివ్‌ సెంటిమెంట్‌ అధికంగా ఉండేందుకు ఆస్కారం ఉంది.’ అని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు.

మరోవైపు ముడిచమురు ధరల్లో కన్సాలిడేషన్‌ చోటుచేసుకోవడం, డాలరుతో రూపాయి బలపడడంతో పాటు స్థూల గణాంకాల ఆధారంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం నెలకొనవచ్చని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. వచ్చే ఏడాది రెండవ వారం నుంచి ప్రారంభంకానున్న క్యూ3 (అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలు మార్కెట్‌ దిశకు మరింత స్పష్టత ఇవ్వనున్నాయని వివరించారు.  

నికాయ్‌ గణాంకాల వెల్లడి..
ఎనిమిది కీలక రంగాల వృద్ధిరేటుకు సంబంధించిన సమాచారం ఈ వారంలోనే వెల్లడికానుండగా.. నవంబర్‌ నెల దేశీ మౌళిక సదుపాయాల నిర్మాణ సమాచారాన్ని ప్రభుత్వం సోమవారం వెల్లడించనుంది. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరంగ్‌ పర్చేరింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) బుధవారం, నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ శుక్రవారం వెల్లడికానున్నాయి. ఈవారంలోనే ఆటోమొబైల్‌ కంపెనీలు తమ డిసెంబర్‌ నెలకు సంబంధించిన అమ్మకాల డేటాను ప్రకటించనున్నాయి.

ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలకొన్న ద్రవ్య లభ్యత కొరత ఈసారి ఆటో డేటాపై ఉత్కంఠ నింపిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఓలా, ఉబెర్‌ వంటి ఆటో అగ్రిగేటర్‌ సంస్థల మద్దతుతో వాల్యూమ్స్‌ నిలబడే అవకాశం ఉందనే ఆశాభావం ఉన్నట్లు వ్యక్తంచేశారు. ఇక అంతర్జాతీయ గణాంకాల పరంగా చూస్తే.. అమెరికా, చైనా దేశాల డిసెంబర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐలు బుధవారం వెల్లడికానున్నాయి. ఈ మొత్తం సమాచారాల ఆధారంగానే మార్కెట్‌ కదలికలు ఈవారంలో ఉండనున్నట్లు వినోద్‌ నాయర్‌ అన్నారు.

ఎఫ్‌పీఐల నికర పెట్టుబడి రూ.5,477 కోట్లు
ముడి ధరలు తగ్గడం, డాలరుతో రూపాయి మారకం విలువ బలపడిన కారణంగా డిసెంబర్‌ 3–28 కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ)లు రూ.5,477 కోట్లను దేశీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల సమాచారం ద్వారా వెల్లడైంది. రూ.1,900 కోట్లను ఈక్విటీలో నికరంగా ఇన్వెస్ట్‌చేసిన వీరు రూ.3,577 కోట్లను డెట్‌ మార్కెట్‌లో పెట్టుబడిపెట్టినట్లు తేలింది.  

71–72 శ్రేణిలో రూపాయి..
గడిచిన వారంలో ముడిచమురు ధరలు భారీగా పతనమయ్యాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 52.20 డాలర్లకు పతనం కాగా, యూఎస్‌ క్రూడ్‌ 45.12 డాలర్లకు పడిపోయి.. వరుసగా మూడవ వారంలోనూ పతనాన్ని నమోదుచేశాయి. అక్టోబర్‌ గరిష్టస్థాయిల నుంచి 39 శాతం, ఏడాది ప్రాతిపదికన 17 శాతం పడిపోయాయి. ఉత్పత్తిలో కోత కారణంగా బ్రెంట్‌ ధర 50 డాలర్ల సమీపంలో బోటమ్‌ కావచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

మరోవైపు డబ్ల్యూటీఐ ధర మరింత పతనమైతే యూఏఈ, రష్యాలు అత్యవసర సమావేశానికి పిలుపునివ్వగా.. ఇందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆనంద్‌ రాఠీ కమోడిటీస్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ హెచ్‌ రవీంద్ర వీ రావు విశ్లేషించారు. ఇక గతవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.93 వద్దకు చేరుకుంది. అమెరికా డాలర్‌ బలహీనపడటం, ఈక్విటీ మార్కెట్‌ బలపడటం వంటి సానుకూల అంశాలతో రూపాయి విలువ బలపడింది. దిగుమతిదారులు అన్‌హెడ్జ్‌ పొజిషన్లను కవర్‌చేసుకోవడం కోసం వచ్చే కొద్ది సెషన్లలో క్యూ కట్టవచ్చని  ఈకారణంగా రానున్న సెషన్లలో రూపాయి 71–72 స్థాయిలో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు