పొలం నుంచి వంట గదికి!

16 Feb, 2019 00:21 IST|Sakshi

రైతులతో ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్న అవర్‌ఫుడ్‌

ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో 85 కేంద్రాలు; డిసెంబర్‌ నాటికి 500లకు

ఏడాదిలో రాజస్తాన్, గుజరాత్, జార్ఖండ్‌లకు విస్తరణ

2 నెలల్లో రూ.21 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

‘స్టార్టప్‌ డైరీ’తో అవర్‌ఫుడ్‌ ఫౌండర్‌ బాలారెడ్డి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రైతు పండించే పంట వినియోగదారునికి చేరే క్రమంలో మధ్యలో పెద్ద తతంగమే ఉంటుంది. మిల్లర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్‌.. ప్రతీ వ్యవస్థనూ దాటుకొని ఉత్పత్తులు కస్టమర్‌కు చేరాలి. అలా కాకుండా పంట  ఉత్పత్తులు రైతు నుంచి నేరుగా కస్టమర్‌కు చేరితే? దీంతో అన్నదాతకు సరైన ధర రావటంతో పాటూ ఉత్పత్తుల వేస్టేజ్, నాణ్యత ఇబ్బందులూ ఉండవు. ఇదే – హైదరాబాద్‌కు చెందిన అగ్రిప్రెన్యూర్‌ స్టార్టప్‌ అవర్‌ఫుడ్‌ కాన్సెప్ట్‌! మరిన్ని వివరాలు కంపెనీ ఫౌండర్‌ బాలారెడ్డి ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 

‘‘మా సొంతూరు సూర్యాపేటలోని ఆత్మకూరు గ్రామం. ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ పూర్తయ్యాక.. కాగ్నిజెంట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరా. రైతు కుటుంబం కావటంతో పొలం పనులు, అందులోని ఇబ్బందులు బాగా తెలిసినవాణ్ని. టెక్నాలజీ సహాయంతో అగ్రికల్చర్‌లో మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా ఆలోచనలు చేసేవాణ్ణి. అందుకే ఐఐఎం అహ్మదాబాద్‌లో అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశా. ఆ తర్వాత మరో ఇద్దరు మిత్రులు రఘు ప్రసాద్, శశికాంత్‌లతో కలిసి రూ.3 కోట్ల పెట్టుబడులతో 2016 జనవరిలో అవర్‌ఫుడ్‌.కో.ఇన్‌ ప్రారంభించాం. గ్రామీణ యువతతో పొలం దగ్గర్లోనే ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయించి.. ఆయా ఉత్పత్తులను రెస్టారెంట్లు, హోటల్స్, కేటరింగ్, వ్యాపారస్తుల వంటి రిటైలర్లకు విక్రయించడమే అవర్‌ఫుడ్‌ ప్రత్యేకత. 

డిసెంబర్‌ నాటికి 500 యూనిట్లు..
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మొత్తం 85 ప్రాసెసింగ్‌ యూనిట్లున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతతో లీజ్‌ రెంటల్‌ మోడల్‌లో ప్రాసెసింగ్‌ యూనిట్లను పెట్టిస్తున్నాం. ఒక్క యూనిట్‌ ఏర్పాటుకు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ప్రతి నెలా 50 యూనిట్లను జత చేస్తూ.. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 500 యూనిట్లను పెట్టాలని లకి‡్ష్యంచాం. వచ్చే ఏడాది నుంచి రాజస్తాన్, జార్ఖండ్, గుజరాత్‌లో యూనిట్లను నెలకొల్పుతాం.

నెలకు రూ.15 కోట్ల ఆదాయం..
ప్రస్తుతం ప్రతి నెలా రిటైలర్ల నుంచి 180 టన్నుల ఉత్పత్తుల ఆర్డర్లు వస్తున్నాయి. గత నెలలో 1.2 కోట్ల ఆదాయం ఆర్జించాం. డిసెంబర్‌ నుంచి నెలకు రూ.15 కోట్ల ఆదాయాన్ని చేరుకోవాలని లకి‡్ష్యంచాం. ప్రస్తుతం మియాపూర్‌లో 4 వేల చ.అ.ల్లో సొంత గిడ్డంగి ఉంది. ఇందులోనే అన్ని రకాల ఉత్పత్తులను నిల్వ చేస్తున్నాం. త్వరలోనే వరంగల్, కరీంనగర్‌ వంటి అన్ని జిల్లా కేంద్రాల్లో గిడ్డంగులను అద్దెకు తీసుకోనున్నాం. ఆయా జిల్లాలో సేల్స్‌ ఆఫీసులు ఏర్పాటు చేసి.. లోకల్‌ మార్కెట్లో విక్రయిస్తాం.

2 నెలల్లో రూ.21 కోట్ల సమీకరణ..
ప్రస్తుతం మా కంపెనీలో 35 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో 200 మంది ఉద్యోగులను నియమించుకుంటాం. ‘‘ప్రస్తుతం ఆపరేషనల్‌ బ్రేక్‌ఈవెన్‌కు వచ్చాం. ఇటీవలే అమెరికాకు చెందిన ఓ వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ మా కంపెనీలో రూ.2 కోట్ల పెట్టుబడులు పెట్టింది. త్వరలోనే మన దేశానికి చెందిన ఓ వీసీ ఫండ్‌ నుంచి రూ.21 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పేపర్‌ వర్క్‌ పూర్తయింది. 2 నెలల్లో డీల్‌ క్లోజ్‌ అవుతుంది’’ అని బాలారెడ్డి వివరించారు. 

మరిన్ని వార్తలు