డిజిన్వెస్ట్‌మెంట్‌ నిధులు.. ఇన్‌ఫ్రాకే

4 Feb, 2020 05:15 IST|Sakshi

ఫిక్కీ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్‌) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ‘సమీకరించిన నిధులను ఏం చేయబోతున్నామన్నది స్పష్టంగా చెబుతున్నాం. మీ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవడానికి దీనితో వెసులుబాటు లభిస్తుంది. ప్రైవేట్‌ రంగం ప్రభుత్వానికి తోడ్పడాలి. దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రైవేట్‌ రంగానికి తోడ్పాటు అందిస్తుంది’ అని ఆమె చెప్పారు. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై విధించే సుంకాల ద్వారా వచ్చే నిధులను.. మైరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎకానమీకి ఊతమిచ్చేందుకు నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు.

రూ. 1.13 లక్షల కోట్ల మోసాలు..
ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాం కులు,  ఆర్థిక సంస్థల్లో ఏకంగా రూ. 1,13,374 కోట్ల మోసాలు చోటు చేసుకున్నా యని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో భారీ మోసాలను సత్వరం గుర్తించేందుకు, నివారించేందుకు 2015లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, సమస్యల గుర్తింపు, పరిష్కారం, అదనపు మూలధనం అందించడం, సంస్కరణలు వంటి చర్యలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు గతేడాది సెప్టెంబర్‌ 30 నాటికి రూ.1.68 లక్షల కోట్ల మేర తగ్గి రూ.7.27 లక్షల కోట్లకు చేరాయని మంత్రి వివరించారు.   

ఎల్‌ఐసీ పాలసీదారుల ప్రయోజనాలు కాపాడతాం
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీలో వాటాల విక్రయ అంశంలో పాలసీదారుల ప్రయోజనాలను కచ్చితంగా పరిరక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టం చేశారు. లిస్టింగ్‌ వల్ల ఎల్‌ఐసీలో పారదర్శకత మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు.  వాటాలు ఎంత మేర విక్రయించవచ్చన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎల్‌ఐసీ చట్టాన్ని సవరించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఎల్‌ఐసీలో కేంద్రానికి 100% వాటా ఉంది.

>
మరిన్ని వార్తలు