మ్యూచువల్‌ ఫండ్స్‌ డివిడెండ్‌పై పన్ను పోటు!

19 Jun, 2017 00:51 IST|Sakshi
మ్యూచువల్‌ ఫండ్స్‌ డివిడెండ్‌పై పన్ను పోటు!

ముంబై: కేంద్ర ప్రభుత్వం మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్ల డివిడెండ్‌ ఆదాయంపై కన్నేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 10 శాతం పన్ను విధించే యోచనలో ఉంది. దీంతో వార్షికంగా రూ.740 కోట్ల ఆదాయం పన్ను రూపంలో ప్రభుత్వానికి లభించనుంది. ఆదాయపన్ను శాఖ ఇటీవలే ఆదాయపన్ను చట్టం – 2017లో సెక్షన్‌ 115బీబీడీఏను సవరణతో నోటిఫై చేసింది. ఒక అసెస్సీ (రిటర్నులు దాఖలు చేసే వారు) మొత్తం ఆదాయం ఒక ఏడాదిలో రూ.10 లక్షలు దాటితే... సంబంధిత అసెస్సీ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల డివిడెండ్‌పై 10 శాతం పన్నును వసూలు చేయాలని  నిబంధన చెబుతోంది.

 ప్రస్తుతం ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు రూ.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా దేశీయ కంపెనీల నుంచి డివిడెండ్‌ రూపంలో ఆదాయం అందుకుంటే దానిపై 10 శాతం పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. కంపెనీ ప్రమోటర్లు, అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్ల లక్ష్యంగా దీన్ని అమలు చేస్తున్నారు. కానీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కంపెనీల నుంచి అందుకునే డివిడెండ్లపై పన్ను మినహాయింపు వుంది. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని ఆదాయపన్ను చెల్లింపుదారులు అందరికీ అమలు చేయనున్నారు.

 పన్ను ఎగ్గొట్టేందుకు కొందరు ప్రమోటర్లు ట్రస్ట్‌లను ఏర్పా టు చేస్తుండడంతో అటువంటి అవకాశం లేకుండా ఈ నిబంధనను అందరికీ వర్తింపజేయనున్నారు. అయితే, ఈ విషయాన్ని ఇప్పటికే  ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లిన మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేన్‌ ‘యాంఫి’ మాత్రం... తమ డిమాండ్‌ మేరకు డివిడెండ్‌పై పన్ను ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెడుతుందని ఆశిస్తోంది.

మరిన్ని వార్తలు