వచ్చే ఏడాది నుంచి డివిడెండ్ ఇస్తాం

17 Sep, 2015 01:59 IST|Sakshi
వచ్చే ఏడాది నుంచి డివిడెండ్ ఇస్తాం

కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్‌ప్రైజెస్ (సీటీఈ) చైర్మన్ ఆశిష్ కల్రా
 
♦ రెండేళ్లలో ఐదురెట్ల వ్యాపార వృద్ధి లక్ష్యం
♦ 2017 నాటికి నెలకు 20 లక్షల డాలర్ల ఆదాయం
♦ బిగ్‌డేటా, క్లౌడ్‌కలయికతో విశ్లేషణ సేవలు
♦ 750కు పెరగనున్న సిబ్బంది సంఖ్య
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్‌లను అనుసంధానం చేయడం ద్వారా ఒక మౌస్ క్లిక్‌తో వినియోగదారులకు అవసరమైన విశ్లేషణాత్మక సమాచారాన్ని అందిస్తామని కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్‌ప్రైజెస్ అంటోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ చిన్న స్థాయి ఐటీ కంపెనీ వచ్చే రెండేళ్లలో ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వ్యాపార విస్తరణ, అందిస్తున్న సేవలపై కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్‌ప్రైజెస్ (సీటీఈ) చైర్మన్ ఆశిష్ కల్రాతో ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ఇంటర్వ్యూ...

 బిగ్‌డేటా, క్లౌడ్ సేవల్లో ఉన్న సీటీఈ ఎటువంటి సేవలను అందిస్తోంది?
 ఐటీ సర్వీస్ సేవల్లో ఉన్న కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ ఎంటర్‌ప్రైజెస్ (సీటీఈ) గత జనవరి నుంచి వ్యాపార వ్యూహాన్ని మార్చుకున్నాం. అపార అవకాశాలున్న బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ నెట్ వర్కింగ్ డేటాపై దృష్టిసారించాం. అందరిలాగా కాకుండా ఈ మూడింటిని కలిపి విశ్లేషణ సేవలను అందిస్తున్నాం. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందుండే ఇండియా, అమెరికా డేటా మార్కెట్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తున్నాం. ఒక మౌస్ క్లిక్‌తో కావాల్సిన సమాచారాన్ని విశ్లేషణాత్మకంగా అందించే విధంగా సేవలను విస్తరిస్తున్నాం.

 ఏ రంగాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు?
 ముఖ్యంగా ఆరు రంగాలపై దృష్టిపెడుతున్నాం. ఎనర్జీ, లైఫ్‌సెన్సైస్, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, టెక్స్‌టైల్, షిప్పింగ్ రంగాలకు చెందిన కస్టమర్లపై దృష్టిపెడుతున్నాం. ఈ మధ్యనే ఒరాకిల్, అమెజాన్ వెబ్‌సర్వీసెస్, రాక్‌స్పేస్, ఫోర్జ్‌రాక్, టాబ్లు వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ముఖ్యంగా అమెరికా, ఇండియా మార్కెట్లపైనే దృష్టిసారిస్తున్నాం.

 ఆదాయం, వ్యాపార వృద్ధి విషయాల గురించి వివరిస్తారా?
 వచ్చే ఆర్థిక ఏడాది నుంచి క్రమం తప్పకుండా వాటాదారులకు డివిడెండ్ ప్రకటించే కంపెనీగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంచనాలకు అనుగుణంగానే వ్యాపార వ్యూహాన్ని మార్చిన తర్వాత మొదటి ఆరు నెలల్లో ఆదాయంలో రెట్టింపు, నికర లాభంలో ఐదు రెట్ల వృద్ధిని నమోదు చేశాం. 2017 మార్చినాటికి ప్రతి నెలా రెండు మిలియన్ డాలర్ల (నెలకు సుమారు రూ. 13 కోట్లు )ఆదాయాన్ని సమకూర్చే స్థాయికి కంపెనీని తీసుకెళ్ళాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం కంపెనీ ఆదాయం నెలకు రూ. 2.5 కోట్లుగా ఉంది. ఈ మార్చినాటికి కంపెనీ ఆదాయం రూ. 6.5 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నాం.

 కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలతో ఏదైనా కంపెనీలను టేకోవర్ గురించి చేసే ఆలోచన ఉందా?  విస్తరణ కార్యక్రమాల గురించి తెలియచేస్తారా?
  కంపెనీలను కొనుగోలు చేసి వేగంగా విస్తరించే యోచన లేదు. అలాగే సొంతంగా క్యాంపస్ నిర్మించే యోచన కూడా లేదు. కంపెనీ వద్ద ఉన్న నగదు నిల్వలను ఉద్యోగుల శిక్షణ, కొత్త సిబ్బంది నియాకానికే వినియోగిస్తాం. రెండేళ్లలో సిబ్బంది సంఖ్యను ప్రస్తుతమున్న 250 నుంచి 700కు పెంచనున్నాం. ఇందులోభాగంగా అమెరికాలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను 30 నుంచి 100కు పెంచనున్నాం. మా కంపెనీలో ఉద్యోగుల వలసలు 1 శాతం కంటే తక్కువగా ఉందంటే ఉద్యోగులకు ఎటువంటి సదుపాయాలను కల్పిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు.

 రెండేళ్ల తర్వాత బిగ్‌డేటా, క్లౌడ్ విభాగాల్లో సీటీఈని ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు?
 మా వ్యాపార విధానమే విభిన్నమైనది. మేము ఎవరికీ పోటీ కాము. బిగ్‌డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ మార్కెట్ విలువ రెండు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఇంత పెద్ద మార్కెట్ అవకాశాలున్న దాంట్లో ఒక శాతం వాటాను కైవసం చేసుకున్నా.. మేం రెండేళ్ళలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం.

మరిన్ని వార్తలు