6 నెలల్లో మొత్తం జరిమానా కట్టేస్తాం

8 Jan, 2015 01:16 IST|Sakshi
6 నెలల్లో మొత్తం జరిమానా కట్టేస్తాం

సుప్రీంకు డీఎల్‌ఎఫ్ హామీ
న్యూఢిల్లీ: కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించిన జరిమానాకు సంబంధించిన మొత్తాన్ని జనవరి 15 నుంచీ ఆరు నెల వారీ విడతల్లో చెల్లిస్తామని రియల్టీ దిగ్గజం- డీఎల్‌ఎఫ్ బుధవారం సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. ఇప్పటికే రూ.150 కోట్లు చెల్లించిన డీఎల్‌ఎఫ్, మిగిలిన రూ.480 కోట్లను ఆరు నెలల్లో చెల్లిస్తానని అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించుకుంది.

దీనికి జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ, ఎన్‌వీ రమణలతో కూడిన డివిజనల్ బెంచ్ అంగీకరించింది. సీసీఐ ఉత్తర్వుపై తుది విచారణను ఫిబ్రవరి 11 నుంచీ చేపడతామని సైతం ఈ సందర్భంగా బెంచ్ తెలిపింది. అసలు ఈ కేసు విచారణా పరిధి కాంపిటేషన్ కమిషన్‌కు ఉంటుందా...? లేదా దీనిని వినియోగదారుల ఫోరమ్ చూడాల్సి ఉందా..? అన్న అంశాన్ని తొలుత విచారణకు చేపట్టనున్నట్లు బెంచ్ పేర్కొంది.

రియల్టీ రంగానికి సంబంధించి గుత్తాధిపత్యం కేసులో డీఎల్‌ఎఫ్‌పై సీఐఐ రూ. 650 కోట్లు జరిమానా విధించింది. అయితే దీనిపై డీఎల్‌ఎఫ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణకు తొలుత జరిమానాను రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనితో ఈ మొత్తంలో ఇప్పటికి సంస్థ రూ.150 కోట్లు చెల్లించింది.

మరిన్ని వార్తలు