లేట్ చేస్తే.. రోజుకు రూ.5 వేలు ఫైన్!

8 Jun, 2016 15:16 IST|Sakshi
లేట్ చేస్తే.. రోజుకు రూ.5 వేలు ఫైన్!

న్యూఢిల్లీ : భారత్ లో అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్‌కు మొట్టికాయలు పడ్డాయి. హర్యానాలోని పంచకుల ప్రాజెక్టులో భాగంగా 50 మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో అత్యున్నత వినియోగదారుల కమిషన్ చీటింగ్ కింద పెనాల్టీ విధించింది. ఏడాదికి 12 శాతం జరిమానా చెల్లించాలని పేర్కొంది. జస్టిస్ జేఎమ్ మాలిక్ నేతృత్వంలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్(ఎన్ సీడీఆర్ సీ) బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది.

కంపెనీ ముందుగా చెప్పిన సమయానికే కొనుగోలుదారులకు అపార్ట్‌మెంట్లు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో ప్రాజెక్టు ముగిసేవరకు రోజుకు రూ.5 వేల చొప్పున జరిమానా కట్టాలని  డీఎల్ఎఫ్‌ను ఆదేశించింది. 50మంది ఫిర్యాదుదారులను వేధించినందుకు డీఎల్ఎఫ్ నష్టపరిహారం కింద ప్రతి ఒక్కరికి రూ.30 వేలు చెల్లించాలని బిల్డర్ కు ఆదేశాలు జారీచేసింది. అలాట్‌మెంట్ తేదీ నుంచి మూడేళ్లలోగా డీఎల్ఎఫ్ కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది. 2013లో కొనుగోలుదారులకు ఈ ఫ్లాట్లు ఇవ్వాలి.

కానీ తన ప్రతిపాదించిన సమయాన్ని డీఎల్ఎఫ్ బ్రేక్ చేసింది. కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోంది. దీంతో ఫిర్యాదుదారులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇప్పటివరకూ ఫ్లాట్లు ఇవ్వకుండా కొనుగోలుదారులను వేధించినందుకు డీఎల్ఎఫ్ వడ్డీ చెల్లించాలని, ప్రస్తుతం కంపెనీ ప్రతిపాదించిన సమయం లోపు ఫ్లాట్లను ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రోజుకు రూ.5వేల జరిమానా ఫిర్యాదుదారులకు చెల్లించాలని బెంచ్ తెలిపింది.

మరిన్ని వార్తలు