కుప్పకూలిన డీఎల్‌ఎఫ్ షేరు

15 Oct, 2014 01:10 IST|Sakshi
కుప్పకూలిన డీఎల్‌ఎఫ్ షేరు

ముంబై: నాలుగేళ్ల దర్యాప్తు తరువాత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడేళ్లపాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి డీఎల్‌ఎఫ్‌ను నిషేధించడంతో ఇన్వెస్టర్లు షాక్‌తిన్నారు. ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీతోపాటు, బీఎస్‌ఈ-100 సూచీలో భాగమైన ఒక షేరుపై సెబీ ఈ స్థాయిలో విరుచుకుపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో డీఎల్‌ఎఫ్ షేర్లను వొదిలించుకోవడానికి ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. వెరసి బీఎస్‌ఈలో డీఎల్‌ఎఫ్ షేరు ఒక్కసారిగా 28% కుప్పకూలింది. రూ. 105 వద్ద ముగిసింది. ఒక దశలో అమ్మకాలు వెల్లువెత్తడంతో 30% వరకూ దిగజారి రూ. 103 వద్ద కనిష్టాన్ని సైతం చవిచూసింది.

ఇది చరిత్రాత్మక కనిష్టంకాగా, ఎన్‌ఎస్‌ఈలోనూ ఇదే స్థాయిలో పతనమై రూ. 105 వద్ద నిలిచింది. ఒక్క రోజులో కంపెనీ మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 7,439 కోట్లమేర ఆవిరైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 18,701 కోట్లకు పరిమితమైంది. రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 10 కోట్ల షేర్లు ట్రేడ్‌కావడం విశేషం!
 
రియల్టీ షేర్లు విలవిల: డీఎల్‌ఎఫ్ ప్రభావంతో బీఎస్‌ఈలో రియల్టీ ఇండెక్స్ ఏకంగా 9% పడిపోయింది. హెచ్‌డీఐఎల్, యూనిటెక్, డీబీ రియల్టీ, గోద్రెజ్ ప్రాపర్టీస్, అనంత్ రాజ్ 5-1% మధ్య నష్టపోయాయి. 2007లో చేపట్టిన ఐపీవోలో భాగంగా దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లో ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించే విధంగా సమాచారాన్ని దాచిపెట్టిందంటూ డీఎల్‌ఎఫ్‌ను మూడేళ్లపాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది.

అంతేకాకుండా ప్రమోటర్, చైర్మన్ కేపీ సింగ్, కుమారుడు రాజీవ్ సింగ్(వైస్‌చైర్మన్), కూతురు పియా సింగ్(హోల్‌టైమ్ డెరైక్టర్)లతోసహా ఆరుగురు అత్యున్నత అధికారులను సైతం క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాల నుంచి నిషేధిస్తూ ఆదేశాలను జారీ చేయడంతో షేరు కుప్పకూలింది. కాగా, అక్రమ బిజినెస్ నిర్వహణకు సంబంధించి కాాంపిటీషన్ కమిషన్ విధించిన రూ. 630 కోట్లను మూడు నెలల్లోగా జమ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆగస్ట్ చివర్లో డీఎల్‌ఎఫ్‌ను ఆదేశించిన విషయం విదితమే. మరోవైపు గుర్గావ్‌లో ప్రభుత్వం డీఎల్‌ఎఫ్‌కు కేటాయించిన 350 ఎకరాల భూమిని రద్దు చేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు గత నెలలో ఆదేశాలు జారీ చేసింది కూడా.

మరిన్ని వార్తలు