డీమార్ట్‌- 4 రోజుల్లో 15 శాతం డౌన్‌

16 Jul, 2020 13:00 IST|Sakshi

తాజాగా 6 శాతం పతనం

3 నెలల కనిష్టానికి షేరు

క్యూ1 ఫలితాల ఎఫెక్ట్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో కొద్ది రోజులుగా నేలచూపులతో కదులుతున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు మరోసారి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు విముఖత చూపుతుండటంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 6.3 శాతం పతనమై రూ. 2012 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం కుప్పకూలి రూ. 1980కు చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా.. ఇంతక్రితం మార్చి 25న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. ఫలితాలు నిరాశపరచడంతో గత 4 రోజుల్లోనే 15 శాతం తిరోగమించింది. వెరసి ఇటీవల చేపట్టిన క్విప్‌ ధర(రూ. 2049) కంటే దిగువకు చేరింది.

వెనకడుగులో
డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల ప్రమోటర్‌ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 88 శాతం పడిపోయి రూ. 40 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 34 శాతం క్షీణించి రూ. 33,883 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 7.4 శాతం బలహీనపడి 2.9 శాతానికి చేరాయి. కంపెనీ ఈ నెల 11న ఫలితాలు వెల్లడించిన విషయం విదితమే. కాగా.. కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో తిరిగి దాదాపు 20 శాతం స్టోర్లను మూసివేసినట్లు తెలుస్తోంది. నిత్యావసరాలకు డిమాండ్‌ కొనసాగుతున్నప్పటికీ కన్జూమర్‌ డ్యురబుల్స్‌ తదితర ప్రొడక్టుల విక్రయాలు మందగించినట్లు రీసెర్చ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ తెలియజేసింది.  

మరిన్ని వార్తలు