బఫెట్‌ చెప్పిందే నిజమా..!

15 Nov, 2017 23:24 IST|Sakshi

ఐపీవోల్లో చేతులు కాల్చుకుంటున్న సామాన్యులు

ఇటీవలి ఇష్యూలన్నీ అధిక రేటుకు అంటగట్టినవే

సమీకరించే నిధులు కంపెనీల వృద్ధికి కాదు

ప్రమోటర్లు, ప్రైవేటు ఇన్వెస్టర్లు బయటపడేందుకే

వాటాల విక్రయంతో వారికి దండిగా లాభాలు

లిస్టింగ్‌లోనే కుదేలు; రిటైల్‌ ఇన్వెస్టర్లకు నష్టాలు!

(సాక్షి, బిజినెస్‌ విభాగం): ‘‘ఐపీవోలకు దూరంగా ఉండాలి’’ అని విఖ్యాత స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ చెప్పిన మాటలు... మన దేశ ఐపీవో మార్కెట్లో అక్షర సత్యాలని రుజువవుతున్నాయి. ఇందుకు ఇటీవలి ఐపీవోలే పెద్ద తార్కాణం. నిన్న ఖాదిమ్‌ ఇండియా దానికి ముందు న్యూ ఇండియా అష్యూరెన్స్, అంతకు ముందు వచ్చిన జనరల్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్, ఎరిస్‌ లైఫ్‌ సైన్సెస్, సీఎల్‌ ఎడ్యుకేట్‌ ఒక్కటేమిటి... పదుల సంఖ్యలో కంపెనీలు ఇటీవల ప్రజల వద్ద ఐపీవో రూట్లో భారీగా నిధులు రాబట్టి, ఆ తర్వాత లిస్టింగ్‌లో ఉసూరుమనిపించాయి. చిన్న ఇన్వెస్టర్లను తలపట్టుకునేలా చేశాయి.

‘‘ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయకూడదు’’ అనేది అధిక విలువ కలిగిన ఇన్వెస్టర్లు పాటించే కట్టుబాటు. ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయవద్దని వారు రిటైల్‌ ఇన్వెస్టర్లకు కూడా సూచిస్తుంటారు. ఇటీవలి మన ఐపీవో మార్కెట్‌ తీరుతెన్నులను పరికించి చూస్తే వేల్యూ ఇన్వెస్టర్లు ఎందుకు వీటికి దూరంగా ఉండాలని సూచిస్తారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు వచ్చిన 30 ఐపీవోల్లో సగానికిపైగా ఇష్యూలు ప్రతికూల రాబడులను ఇచ్చినవే. మొత్తం మీద 60 శాతం ఇష్యూల రాబడులు స్టాక్‌ మార్కెట్ల రాబడుల స్థాయిలో లేకపోవడం నేతిబీర చందాన్ని తలపిస్తోంది. మంచి రాబడులను ఇచ్చిన వాటిలో ఐదు కంపెనీలే ఉన్నాయి. అవి 100 శాతానికిపైగా రిటర్నులిచ్చాయి. వీటిలో డీమార్ట్, సీడీఎస్‌ఎల్‌ తదితర కంపెనీలున్నాయి. పైగా బోలెడన్ని రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయిన ఈ ఇష్యూల్లో షేర్లు అలాట్‌ అయిన కొద్ది మందికే ఆ లాభాలొచ్చాయి. లిస్టింగ్‌ తరవాత కొనుగోలు చేసినవారికి ఆ స్థాయి లాభాలు లేవు. ‘‘లిస్టింగ్‌ లాభాలే సామాన్య ఇన్వెస్టర్లను ఊరిస్తున్నాయి. ఈ తరహా రాబడుల ఆకర్షణతోనే రిటైల్‌ ఇన్వెస్టర్లు వచ్చిన ప్రతీ ఐపీవోకు పోటీపడి ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఐపీవోలను గమనిస్తే ఇదే తెలుస్తోంది’’ అని విశ్లేషకులు చెబుతున్నారు. లిస్టింగ్‌ లాభాల కోసం ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నారని, దీం తో అధిక ధరల వద్ద ఇరుక్కుపోయి, ఎక్కడో ఒకచోట నష్టానికి అమ్మి బయటపడుతున్నారని వారు వివరించారు.

కంపెనీలకు కాదు, పెట్టుబడిదారులకు.. ఈ ఏడాది పలు కంపెనీలు ఐపీఓ మార్గంలో ఇప్పటిరకు రూ.42,000 కోట్లు సమీకరించాయి. ఓ ఏడాదిలో ఈ స్థాయిలో సమీకరణ అన్నది ఐపీవో మార్కెట్లో రికార్డే. వచ్చిన ఇష్యూల్లో దాదాపు 80 శాతం ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో నిధులు సమీకరించినవే. ఈ ఏడాదే కాదు!! గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ఇష్యూలను గమనించినా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో వచ్చినవి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది వచ్చిన ఇష్యూల్లో మూడింట ఒక వంతు వాటిలో ప్రమోటర్లు, పీఈ సంస్థలు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో తమ వాటాలను విక్రయించి సొమ్ము చేసుకోవటం గమనార్హం. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ అంటే... ఐపీవోలో ప్రమోటర్లు, అప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయానికి ఉంచడం. కంపెనీ ఈక్విటీ నుంచి వాటాల జారీ ఉండదు కనుక ఈ విధంగా సేకరించిన నిధులన్నీ ప్రమోటర్లు, పీఈ సంస్థలకే వెళతాయి. ఐపీవో నిధుల్లో కంపెనీల వృద్ధికి కేటాయిస్తున్నవి చాలా పరిమితంగా ఉండటం దురదృష్టకరం. కానీ, గతంలో కంపెనీలు తమ వ్యాపార విస్తరణ ప్రాజెక్టులకు నిధుల కోసమే ఐపీవోలకు వస్తుండటం సహజంగా జరిగేది. 2006–07 మధ్య ఐపీవోలకు వచ్చిన కంపెనీల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి. కాబట్టే అవి ఇన్వెస్టర్లకు భారీ లాభాలు ఇవ్వగలిగాయి.

రెండింటికీ తేడా ఏంటి?
కంపెనీలు విస్తరణ చేపట్టాలనుకుని, దానికి నిధుల్లేక ఐపీఓకు వచ్చాయనుకోండి. మనం ఇన్వెస్ట్‌ చేసిన సొమ్ము నేరుగా కంపెనీకి వెళుతుంది. విస్తరణపై ఆ పెట్టుబడులు పెడతారు కనక కంపెనీతో పాటు దాని విలువ కూడా పెరుగుతుంది. దాంతో ఇన్వెస్టర్ల షేర్‌ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇపుడు చాలా కంపెనీలు తమ విస్తరణ కోసం పీఈ ఇన్వెస్టర్ల దగ్గరో, ఇతర సంస్థల దగ్గరో పెట్టుబడులు తీసుకుంటున్నాయి. వారు ఏదో ఒక సమయంలో బయటకు వెళ్ళాలనుకున్నపుడు... వారి వాటాలను ఐపీఓలో విక్రయిస్తున్నారు. సహజంగానే ఈ ఐపీఓ ద్వారా వారు తమ పెట్టుబడులకు లాభాలు కావాలనుకుంటారు కనక షేరు విలువను మరీ ఎక్కువగా నిర్ణయిస్తున్నారు. దీంతో సగటు ఇన్వెస్టరుకు మిగిలేది ఏమీ ఉండటం లేదు.

సొమ్ము చేసుకుంటున్నారు...
ఇది ఆందోళన కలిగించే ధోరణే. ఐపీవోల్లో నిధుల సమీకరణ అన్నది అధిక శాతం కొత్త ప్రాజెక్టుల కోసం, ప్లాంట్‌ల ఏర్పాటుకు, విస్తరణ కోసం జరగడం లేదు. కేవలం ప్రైవేటు ఈక్విటీ లేదా వెంచర్‌ క్యాపిటల్‌ లేదా ప్రమోటర్ల జేబుల్లోకే వెళుతోంది’’
– ప్రణవ్‌ హాల్దియా, ప్రైమ్‌ డేటా బేస్‌ ఎండీ

దూరంగా ఉండండి
‘‘ఐపీఓ మార్కెట్లో బుడగలు పేరుకుపోయాయి. అవి పగిలే వరకు దూరంగా ఉండడం మేలు. తాజా పేలవ లిస్టింగ్‌లతో భవిష్యత్‌లో పబ్లిక్‌ ఆఫర్‌కు వచ్చే కంపెనీలు ఇష్యూ ధరలను సరసమైన శ్రేణిలో నిర్ణయిస్తాయి. అవసరమైతే రెండు మూడు నెలల పాటు వేచి చూసి తక్కువ, లేదా సరసమైన విలువలను నిర్ణయించి ఐపీవోకు వస్తాయి’’
– రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ప్రముఖ ఇన్వెస్టర్‌
 

వీటికి దూరంగా ఉండటమే మంచిది!
నిపుణుల విశ్లేషణ ప్రకారం... ఓ కంపెనీలో అప్పటికే పెట్టుబడులు పెట్టిన ప్రైవేటు ఈక్విటీ సంస్థలకు ఆ కంపెనీ గురించి సమస్త సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. దీంతో ఆ కంపెనీకి భవిష్యత్తు వ్యాపార వృద్ధి అవకాశాలు ఆశాజనకంగా లేకపోయినా లేదా మార్కెట్‌ సానుకూల పరిస్థితుల వల్ల తమ పెట్టుబడులకు అధిక విలువ లభిస్తుందని భావించినా వారు ఎగ్జిట్‌ అవడానికి ఐపీవోను ఎంచుకుంటున్నారు.  కారణం ఏదైనా ఈ తరహా ఇష్యూలకు ఇన్వెస్టర్లు దూరంగా ఉండటం మంచిదని విశ్లేషకుల సూచన.

అన్నీ ఒక్కటే కాదు...
అలాగని ఐపీఓలన్నిటినీ ఒకే గాటన కట్టడానికి లేదు. ఇప్పుడు ఐపీఓకు వచ్చిన చిన్న కంపెనీలు భవిష్యత్తు ఇన్ఫోసిస్‌ లేదా టీసీఎస్‌ తరహా కంపెనీలుగా ఎదగటానికి అవకాశాలు లేకపోలేదు. కానీ అలాంటివి అరుదుగా వస్తుంటాయి. నిజానికి ఇలాంటి కంపెనీలు కూడా ఐపీఓలో అధిక ధరలకే షేర్లు జారీ చేసే పోకడ ప్రస్తుతం కనుక ఇన్వెస్టర్లు ఆయా కంపెనీల షేర్ల ధరలు తక్కువకు అందుబాటులోకి వచ్చే వరకు ఓపికగా వేచి ఉండి క్యాచ్‌ చేయాలన్నది నిపుణుల సూచన. 

మరిన్ని వార్తలు