ప్రీమియం చెల్లించకపోయినా, చార్జీలు తప్పవా?

20 Jun, 2016 02:19 IST|Sakshi
ప్రీమియం చెల్లించకపోయినా, చార్జీలు తప్పవా?

నేను 2008, మార్చిలో బజాజ్ అలయంజ్ న్యూ ఫ్యామిలీ గెయిన్ పాలసీని తీసుకున్నాను. 2011 మార్చి వరకూ రూ.36,000 ప్రీమియమ్ చెల్లించాను. ఆ తర్వాత ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేశాను. ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.27,443గా ఉంది. ఈ పాలసీ 2018 మార్చిలో మెచ్యూర్ అవుతుంది. గత ఏడాది వివిధ చార్జీల కింద రూ.5,013ను ఈ ఫండ్ నుంచి కోత కోశారు. ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, చార్జీల కోత తప్పదా? ఈ ఫండ్ నుంచి  వైదొలగమంటారా? కొనసాగమంటారా ? సలహా ఇవ్వండి.
- సర్వేశ్, విశాఖపట్టణం

 
బజాజ్ అలయంజ్-న్యూ ఫ్యామిలీ గెయిన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(యూలిప్) పాలసీ. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించిన ప్రీమియమ్  నుంచి మెర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్‌మెంట్ చార్జీలు,... తదితర చార్జీలను మ్యూచువల్ ఫండ్ సంస్థ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ బాగా ఉన్నప్పటికీ, ఈ చార్జీల కారణంగా ఈ తరహా యులిప్‌లపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి.

మీరు ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, పూర్తి కాలానికి వర్తించే ఫిక్స్‌డ్ చార్జీలను మీ ఫండ్ నుంచి మినహాయించుకుంటారు. భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి గాను ఈ ప్లాన్‌ను సరెండర్ చేయండి. మీరు సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే మీ సరెండర్ వాల్యూ అవుతుంది. ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎప్పుడూ బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ప్లాన్‌లను ఎంచుకోవద్దు. బీమా కోసం టర్మ్ పాలసీ తీసుకోవాలి. టర్మ్ పాలసీల్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఏదైనా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి.
 
నా వయస్సు 50 సంవత్సరాలు. ప్రవాస భారతీయుడిని. రూ.3 కోట్లకు టర్మ్ పాలసీని (రూ.3 కోట్ల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్  కవర్ కూడా ఉండాలి) తీసుకోవాలనుకుంటున్నాను. ప్రవాస భారతీయులకు పాలసీలను ఆఫర్ చేస్తున్న భారత కంపెనీల వివరాలను తెలియజేయండి. అలాగే నా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్వీస్, క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియా, తదితర అంశాల ఆధారంగా  నాకు తగిన టర్మ్ పాలసీని సూచించండి.
- ప్రదీప్ జైన్, ఈ మెయిల్ ద్వారా

 
పలు భారత బీమా కంపెనీలు ప్రవాస భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పాలసీలను తీసుకునే ముందు మీరు రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది వ్యయం. మీరు ఎంచుకున్న పాలసీ విదేశాల్లో చౌకగా లభించే అవకాశాలున్నాయా? రెండోది. పన్ను వ్యవహారాలు. మీరు నివసిస్తున్న దేశంలో పన్ను చట్టాలు ఎలా ఉన్నాయి. .. ఈ రెండు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక మీరు తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియమ్.. అదనపు రైడర్స్‌కు  కూడా కవరవుతుందో,  లేదో చెక్ చేసుకోవాలి. లేకుంటే అదనపు రైడర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయం కూడా చెక్ చేసుకోవాలి. మీరు భారత్‌కు వచ్చినప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే బావుంటుంది. దీని వల్ల విదేశాల్లో  వైద్య పరీక్షలు జరిపించుకొని, సంబంధిత రిపోర్టులను బీమా కంపెనీకి పంపించడం కొంచెం వ్యయభరితమైనది.

మీరు భారత్‌లోనే ఉన్నప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే, ఈ వ్యయం మీకు తప్పుతుంది. 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి 3 కోట్ల బీమా కవరేజ్‌కు కొన్ని కంపెనీలు వసూలు చేస్తున్న వార్షిక ప్రీమియమ్‌లు, వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి(గత ఆర్థిక సంవత్సరం) వివరాలు ఇస్తున్నాం. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మ్యాక్స్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,960గా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 96.03గా ఉంది. బిర్లా సన్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.48,262 కాగా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.3గా ఉంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,025గా ఉండగా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 90.5గా ఉంది.

నేను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ఖాతాను ప్రారంభించాను. ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కదా! ఇప్పుడు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవచ్చా? అలాంటి వెసులుబాటు లభిస్తుందా? వివరించగలరు.
- మాధురి, హైదరాబాద్

 
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చుకునే అవకాశం ఎన్‌పీఎస్‌లో ఉంది. అంతేకాకుండా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను(యాక్టివ్ నుంచి ఆటో చాయిస్‌కు లేదా ఆటో చాయిస్ నుంచి యాక్టివ్‌కు) కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు మీ ఎన్‌పీఎస్ ఖాతాకు సంబంధించి ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు.

ఆ ఎనిమిది పెన్షన్ ఫండ్స్‌ఏమంటే-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్, ఎల్‌ఐసీ పెన్షన్ ఫండ్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్, ఎస్‌బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్ మేనేజ్‌మెంట్ కంపెనీ, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్.. ఈ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. గతంలో ఎంచుకున్నదానిని మార్చుకోవచ్చు. ఈ మార్పును సూచిస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్‌కాగానే సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ(సీఆర్‌ఏ) సిస్టమ్ నుంచి మీ నమోదిత ఈమెయిల్ ఐడీకి ఒక ఈ మెయిల్ వస్తుంది.
- ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

>
మరిన్ని వార్తలు