కంపెనీల వేటలో డాక్టర్‌ రెడ్డీస్‌

30 Jul, 2019 13:07 IST|Sakshi
క్యూ1 ఫలితాలను ప్రకటిస్తున్న జి.వి.ప్రసాద్‌. చిత్రంలో సౌమేన్‌ చక్రవర్తి(ఎడమ), ఎరెజ్‌ ఇజ్రేలి

క్యూ1లో లాభం 45 శాతం అప్‌ 

రూ. 663 కోట్లుగా నమోదు 

ఆగస్టు నుంచి కొత్త సీఈవోగా ఎరెజ్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) తాజాగా మరింత వృద్ధి సాధించే దిశగా ఇతర కంపెనీలను కొనుగోలు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు వివిధ దశల్లో ఉన్నాయి. రుణ, ఈక్విటీ నిష్పత్తి కనిష్ట స్థాయిలో ఉండటంతో ఇతర సంస్థల కొనుగోలుకు ఆర్థికంగా కొంత వెసులుబాటు లభించగలదని డీఆర్‌ఎల్‌ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో డీఆర్‌ఎల్‌ సహ చైర్మన్, సీఈవో జీవీ ప్రసాద్‌ ఈ విషయాలు వెల్లడించారు. తొలి త్రైమాసికంలో డీఆర్‌ఎల్‌ నికర లాభం 45% ఎగిసి రూ. 663 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో నికర లాభం రూ. 456 కోట్లు. కెనడాలో రెవ్‌లిమిడ్‌ ఔషధ వివాదానికి సంబంధించి సెల్జీన్‌ సంస్థతో సెటిల్మెంట్‌ ఒప్పందం కింద రూ. 350 కోట్లు అందడం .. కంపెనీ లాభాల పెరుగుదలకు దోహదపడింది. క్యూ1లో సంస్థ ఆదాయం రూ. 3,721 కోట్ల నుంచి రూ. 3,843 కోట్లకు పెరిగింది.  ‘తొలి త్రైమాసికంలో చాలా మటుకు కీలక మార్కెట్లలో వృద్ధి నమోదు చేయగలిగాం. పనితీరును  మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి సారిస్తాం‘ అని ప్రసాద్‌ తెలిపారు. ఆగస్టు 1 నుంచి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎరెజ్‌ ఇజ్రేలీ బాధ్యతలు చేపడతారని ఆయన వెల్లడించారు. జీవీ ప్రసాద్‌ ఇకపై సహ చైర్మన్, ఎండీగా కొనసాగుతారు. ప్రస్తుతం ఇజ్రేలీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

కొత్త ఉత్పత్తుల ఊతం..
కొత్త ఉత్పత్తుల ఊతంతో కీలకమైన ఉత్తర అమెరికా, భారత్‌ తదితర మార్కెట్లలో ఆదాయాలు మెరుగుపర్చుకోగలిగినట్లు డీఆర్‌ఎల్‌ సీఎఫ్‌వో సౌమేన్‌ చక్రవర్తి తెలిపారు. గ్లోబల్‌ జనరిక్స్‌ విభాగం ఆదాయం ఎనిమిది శాతం వృద్ధితో రూ. 3,298 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికాలో జనరిక్స్‌ ఆదాయం మూడు శాతం వృద్ధితో రూ. 1,632 కోట్లకు పెరిగింది. జనరిక్స్‌కు సంబంధించి యూరప్‌లో 19 శాతం (రూ.240 కోట్లు), భారత్‌లో 15 శాతం (రూ. 696 కోట్లు), వర్ధమాన దేశాల మార్కెట్లలో ఆదాయాలు 10 శాతం (రూ. 729 కోట్లు) మేర వృద్ధి నమోదు చేశాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా మార్కెట్లో అయిదు కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడంతో పాటు ఐసోట్రెటినోయిన్‌ ఔషధాన్ని రీ–లాంచ్‌ చేసినట్లు సౌమేన్‌ చక్రవర్తి చెప్పారు. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏలో మొత్తం 107 జనరిక్‌ ఔషధాలకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అమ్మకాల పెరుగుదల, కొత్త ఉత్పత్తుల ఊతంతో భారత మార్కెట్‌ ఆదాయాలు వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి నమోదు చేశాయి.

తగ్గిన పీఎస్‌ఏఐ ..
అయితే, ఫార్మా సర్వీసెస్, యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక ప్రాతిపదికన 16 శాతం, సీక్వెన్షియల్‌గా 33 శాతం క్షీణతతో రూ. 454 కోట్లకు పరిమితమయ్యాయి. కొన్ని ఔషధాల నాణ్యతపరమైన అంశాలు తొలి త్రైమాసికంలో పీఎస్‌ఏఐ విభాగంపై ప్రతికూల ప్రభావం చూపాయని, రెండో త్రైమాసికంలో పరిస్థితులు సర్దుకోగలవని సౌమేన్‌ చక్రవర్తి వివరించారు.  
 ఫలితాలు మార్కెట్‌ ముగిశాక వెల్లడయ్యాయి. సోమవారం బీఎస్‌ఈలో డీఆర్‌ఎల్‌ షేరు సుమారు రెండు శాతం క్షీణించి రూ. 2,653 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు