ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్‌ చేయొచ్చా..?

26 Jun, 2020 15:27 IST|Sakshi

పెట్టుబడి మంచిదే అంటున్న విశ్లేషకులు

ర్యాలీకి ఏ ఢోకా ఉండదు

డిఫాల్ట్‌, క్రెడిట్‌ లాంటి రిస్క్‌ ఉండవు 

రికార్డు స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతున్న బంగారంలో పెట్టుబడులు అధిక రాబడులను ఇస్తాయని బులియన్‌ పండితులు అంటున్నారు. దేశీయంగా ఎంసీఎక్స్‌లో బంగారం ధర ఈ వారంలో రూ.48,589 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. కోవిడ్‌-19 అంటువ్యాధితో ప్రపంచ ఆర్థిక ‍వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు బంగారం ధరను మరింత మెరిసేలా చేశాయి. అన్ని రకాల అసెట్‌ క్లాసెస్‌లో కెల్లా బంగారం మ్యూచువల్‌ ఫండ్లు ఈ ఏడాదిలో 40.39శాతం ఆదాయాల్ని ఇన్వెస్టర్లకు ఇచ్చాయి.

ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.., బంగారంలో పెట్టుబడులు ఎల్లప్పుడు అధిక రాబడులను ఇస్తాయని మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు విశ్వసిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బంగారం ఇచ్చిన బలమైన రాబడుల ట్రాక్‌ రికార్డును ఇందుకు సాక్ష్యంగా వారు చూపుతున్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో పుత్తడిలో పెట్టుబడి మంచిదే: 
ప్రస్తుత పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి మంచి రాబడులను ఇస్తాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమోడిటీ విబాగపు అధిపతి నవ్‌నీత్‌ ధమాని తెలిపారు. ‘‘బంగారం ధర 2001లో గరిష్టాన్ని తాకిన తర్వాత 240శాతం రాబడిని ఇచ్చింది. అలాగే 2008లో గరిష్ట స్థాయిని తాకినపుడు 170శాతం ఆదాయాన్ని ఇచ్చింది. 2013లోనూ 10గ్రాముల బంగారం రూ.35వేల గరిష్టాన్ని తాకిన సమయంలో పెట్టుబడులను పెట్టిన ఇన్వెస్టర్లకు ధీర్ఘకాలంలో కొంతరాబడి లభించింది. తమ సలహాలు పాటిస్తూ సిప్‌ల ద్వారా బంగారం ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మాత్రం రెండంకెల రాబడి లభించింది. ఇప్పుడు కూడా అదే సూత్రాన్ని అమలు చేయమని మా కస్టమర్లకు సలహానిస్తున్నాము’’ అని ధావన్‌ తెలిపారు.

పరిమితికి మించొద్దు
అయితే పరిమితికి మించి బంగారంలో పెట్టుబడులు మంచిది కాదని బులియన్‌ పండితులు చెబుతున్నారు. పరిమితికి మించి పసిడిలో పెట్టుబడులు పెడితే నష్టాలు తప్పవని వారంటున్నారు. పోర్ట్‌ ఫోలియోలో గోల్డ్‌ ఫండ్లకు 10-15శాతం మాత్రమే కేటాయించాలంటున్నారు. ఇంతకు మించి బంగారంలో పెట్టుబడులు పెట్టాలంటే సిప్‌ల పద్దతిలో కొనుగోలు చేయడం ఉత్తమమని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడిటీ రూపంలో కొంత నగదు చేతిలో ఉండటం చాలా ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. 

డిఫాల్ట్‌, క్రెడిట్‌ లాంటి రిస్క్‌లు ఉండవు
గత దశాబ్ధ కాలంలో బంగారం తక్కువ క్షీణతను చవిచూసింది. అసెట్‌ క్లాస్‌గా ఉండే బంగారం ఫండ్లకు డిఫాల్ట్‌ రిస్క్‌గానీ, క్రెడిట్‌ రిస్క్‌గా ఉండవని విక్రమ్‌ ధావన్‌ తెలిపారు. భారత్‌లో దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం 7-8శాతంగా ఉందని, దీనికి సమానంగా బంగారం రాబడిని ఇచ్చింది. కొన్నేళ్ల నుంచి బంగారం దాని విలువను ఎప్పటికప్పుడూ నిరూపించుకుంటుంది కాబట్టి బంగారంలో కొనుగోళ్లకు మేము మద్దతునిస్తున్నామని ధావన్‌ తెలిపారు. 

ర్యాలీకి ఢోకా లేదు
కరోనా కేసులు, యూఎస్‌ ఎన్నికలపై స్పష్టత లేనంత వరకు బంగారం ర్యాలీకి ఏ ఢోకా లేదని అంతర్జాతీయ బులియన్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 2011, 2008ల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాల తరువాత అన్ని అసెట్‌ క్లాసెస్‌ కంటే బంగారమే తొలిసారిగా బౌన్స్‌బ్యాక్‌ను చవిచూసిన సంగతి వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 

మరిన్ని వార్తలు