క్రెడిట్ కార్డు బకాయిలు కూడా కట్టక్కర్లేదా?

27 Mar, 2020 12:08 IST|Sakshi

సాక్షి,  ముంబై :  కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా  కేంద్ర ప్రభుత్వం 1.7లక్షల కోట్ల రూపాయల  రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజే (శుక్రవారం)  కేంద్రం బ్యాంకు ఆర్‌బీఐ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లపై ముందస్తు కోతను విధించడంతోపాటు లాక్‌డౌన్ కష్టాల నుంచి బయటపడేందుకు రుణాలపై భారీ ఊరటనిచ్చింది.  అన్ని రకాల రుణాలపై  మూడు నెలల పాటు మారటోరియం విధించింది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు  ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది. అంతేకాదు సదరు ఖాతాలను ఎన్‌పీఏలుగా పరిగణించరాదని కూడా ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు  ఆదేశాలిచ్చింది. సాధారణంగా రుణగ్రహీతలు 90 రోజులకు పైగా చెల్లింపులను చేయకపోతే బ్యాంక్ ఆ ఖాతాను ఎన్‌పీఏగా  పరిగణిస్తాయి. (రుణ గ్రహీతలకు భారీ ఊరట)

అయితే తాజా ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన తరువాత పలువురు వినియోగదారుల్లో  క్రెడిట్ కార్డు  రుణాల పరిస్థితిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. క్రెడిట్ కార్డు రుణాలు, లేదా బకాయిలకు కూడా మూడు నెలల మారటోరియం  వర్తిస్తుందని స్పష్టం చేసింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది. (వచ్చే 3నెలలు ఈఎంఐలు కట్టకపోయినా ఫర్వాలేదు)

మరోవైపు ఆర్బీఐ తాజా నిర్ణయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. ఆర్‌బీఐ కల్పించిన వెసులుబాట్లపై అటు మార్కెట్ వర్గాలు, ఇటు  విశ్లేషకులు కూడా సంతోషాన్ని ప్రకటించారు.

మరిన్ని వార్తలు