మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ ఉండదా ?

9 Apr, 2018 02:54 IST|Sakshi

బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మాదిరిగా రాబడులనిచ్చే డెట్‌ ఫండ్స్‌ను సూచించండి ?      – అనిత, హైదరాబాద్‌  
ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, లిక్విడ్‌ ఫండ్స్‌ను పరిశీలించండి. ఏడాది, లేదా ఏడాదిన్నర కాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, అల్ట్రా  షార్ట్‌–టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. మూడు నుంచి ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, డెట్‌ ఫండ్స్‌ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ఈ కాలంలో మార్కెట్లో ఉత్థానాలు, పతనాలు అధికంగా ఉంటాయి, వడ్డీరేట్లలో తరుగుదల, పెరుగుదల చోటు చేసుకోవచ్చు. బాండ్ల ధరలు పెరగవచ్చు. తరగవచ్చు.  మొత్తం మీద మీకు నష్టాలు వచ్చే అవకాశాలే అధికంగా ఉంటాయి. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా స్వల్ప కాలంలో మీకు నష్టాలు రాకుండా ఉండటమనేది చాలా ముఖ్యం. అందుకని షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌కు మించి ఆలోచించవద్దు.  

నేను ఒక ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఇటీవలనే ఒక పాప పుట్టింది. నాకు ఆస్తిపాస్తులేమీ లేవు. నేను ఎంత మొత్తానికి బీమా తీసుకోవాల్సి ఉంటుంది.      – కిశోర్, విజయవాడ
ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే విషయమై చాలామంది బీమా ఏజెంట్లపైననే ఆధారపడతారు. ఎంత మొత్తానికి, ఎంత కాలానికి బీమా తీసుకోవాలన్న నిర్ణయానికి చాలా అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలి.  మీరు రిటైర్‌ కావడానికి ఎంత సమయం మిగిలి ఉంది అనే అంశం కీలకమైనది. ఉదాహరణకు మీరు రిటైర్‌ కావడానికి 20 ఏళ్ల సమయం ఉందనుకోండి. మీరు తీసుకునే  పాలసీ కనీస  టర్మ్‌ 20 ఏళ్లు ఉండాలి. మీకు ఉన్న అప్పులు కూడా మరో కీలకాంశమే.

మీరు లేని పక్షంలో మీ అప్పులు కూడా తీరిపోయేలా మీ బీమాపాలసీ ఉండాలి. అందుకని బీమా పాలసీ తీసుకునేటప్పుడు మీ అప్పులను  కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీ పిల్లల విద్యావసరాలకయ్యే ఖర్చులు, భవిష్యత్తు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తు ఖర్చులను పరిగణించడానికి ద్రవ్యోల్బణం కనీసం 5–7 శాతం రేంజ్‌లో ఉంటుందన్న అంచనాలకు  చోటివ్వాలి. 

ప్రస్తుత జీవన శైలి, వార్షిక కుటుంబ ఆదాయం, వార్షిక వ్యయాలు, ప్రస్తుత పెట్టుబడులు, గృహ, విద్యా రుణాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలా బీమా సంస్థలు హ్యుమన్‌ లైఫ్‌ వేల్యూ కాలుక్యులేటర్‌ను తమ వెబ్‌సైట్లలో అందుబాటులోకి తెచ్చాయి. దీని ద్వారా ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. అధిక బీమా తీసుకుంటే అధిక ప్రీమియమ్‌ చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ బీమా తీసుకుంటే, అవసరమైన పక్షంలో ఆ బీమా సరిపోకపోవచ్చు. అందుకని తగిన బీమా తీసుకోవడం తప్పనిసరి.  

మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిస్క్‌ తక్కువగా  ఉంటుందా ?   – జాన్సన్, కరీంనగర్‌  
నష్టభయం లేని ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం దాదాపు లేదు. మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా రిస్క్‌కు అతీతం కాదు. ఈక్విటీ ఫండ్స్, డెట్‌ ఫండ్స్‌లో రిస్క్‌ కొంచెం అధికంగానే ఉంటుందని చెప్పవచ్చు. అ«ధిక రిస్క్‌ నుంచి అల్ప రిస్క్‌ ఉన్న పరంగా చూస్తే, ధీమాటిక్, లేదా సెక్టోరియల్‌ ఫండ్స్‌ అగ్రభాగాన ఉంటాయి.

మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ తర్వాతి స్థానాల్లో నిలుస్తాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇతర రిస్క్‌లు కూడా ఉంటాయి. అయితే సరైన నిర్ణయాలతో ఈ రిస్క్‌ను కనిష్ట స్థాయికి తగ్గించుకోవచ్చు. వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌కు చెందిన రకరకాల ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఫండ్‌ హౌజ్, ఫండ్‌ మేనేజర్, స్కీమ్‌ స్పెసిఫిక్‌ రిస్క్‌ను తగించుకోవచ్చు. మల్టీ క్యాప్‌ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.  

నాకు ఇటీవలే ఉద్యోగం వచ్చింది. కొంత మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. విస్తృతమైన రీసెర్చ్‌ తర్వాత మూడు మ్యూచువల్‌ ఫండ్స్‌ను షార్ట్‌లిస్ట్‌ చేశాను. అవి–డీఎస్‌పీ బ్లాక్‌రాక్‌ మైక్రో క్యాప్‌ ఫండ్, ఎస్‌బీఐ మేగ్నమ్‌ మల్టీప్లయర్‌ ఫండ్, ఎస్‌బీఐ మేగ్నమ్‌ మిడ్‌క్యాప్‌ ఫండ్‌. నా ఇన్వెస్ట్‌మెంట్‌ కాలానికి ఈ ఫండ్స్‌ సరైనవేనా ?     – మెహిసిన్, విశాఖపట్టణం  
మీరు ఐదేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. పైగా మ్యూచువల్‌ఫండ్స్‌కు కొత్త. కాబట్టి ముందుగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌తో ప్రారంభించండి. గత ఏడాది పనితీరు ఆధారంగా ఈ ఏడాది ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్న ఫండ్‌ను ఎంచుకోవడం కొంచెం రిస్క్‌తో కూడిన వ్యవహారమే. 2–3 ఏళ్ల కాలానికి కూడా తగిన రాబడులు రాకపోవచ్చు. ఉదాహరణకు 2010–13 మధ్య కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లకు చాలా స్వల్ప రాబడులే వచ్చాయి.

2005–08 మధ్య కాలానికి ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లకు అయితే లాభాలు రాకపోగా, నష్టాలు వచ్చాయి. ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, 1–2 మల్టీ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోండి. మైక్రోక్యాప్‌ ఫండ్స్‌ మంచి రాబడులే ఇస్తాయి. కానీ స్వల్ప కాలంలో 30–40 శాతం దాకా నష్టపోయే అవకాశాలూ ఉంటాయి. దీంతో తొలిసారి మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవాళ్ల ఆర్థిక ప్రణాళికలన్నీ కకావికలమవుతాయి.

అందుకని ముందుగా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టండి. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విధానాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు సంబంధించి వివిధ అంశాల పట్ల అవగాహన పెరిగిన తర్వాత ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మొదలు పెట్టండి.


- ధీరేంద్ర కుమార్‌,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

మరిన్ని వార్తలు