రిజర్వ్‌ బ్యాంకుకే ‘కన్నం’ వేస్తున్నారు!

13 Dec, 2018 15:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఆయిల్‌ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా అస్తవ్యస్తంగా అగమ్యగోచరంగానే ఉంది. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు. ఖాళీ అవుతున్న ఉద్యోగాలే భర్తీ కావడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టయిన చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తిలో (జీడీపీ) ఆర్థిక ద్రవ్యలోటు 3.3 శాతాన్ని మించరాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇప్పటికీ అది 3.6 శాతానికి చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది మరింత పెరిగే ప్రమాదం ఉంది. 

పరోక్ష పన్నుల వసూళ్లు లక్షిత వసూళ్లకు అంతనంత దూరంలోనే ఉన్నాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో లక్ష్యాన్ని అందుకోవాలంటే ఈ డిసెంబర్‌ నెల నుంచి 2019, మార్చి నెల వరకు 45 శాతం వసూళ్లు జరగాలి. లక్షిత జీఎస్టీ వసూళ్లలో గత ఎనిమిది నెలల్లో జరిగిన వసూళ్లు 55 శాతం అన్నమాట. ఈ నాలుగు నెలల్లో మిగతా 45 శాతం వసూళ్లు చేయడం దాదాపు అసాధ్యం. దేశంలోని 11 భారత ప్రభుత్వరంగ బ్యాంకులు పూర్తిగా దివాలా తీశాయి. వాస్తవానికి వీటిని ఎప్పుడో మూసివేయాలి. కానీ 2017, ఏప్రిల్‌ ఒకటవ తేదీన తీసుకొచ్చిన ‘ప్రాప్ట్‌ కరెక్టివ్‌ ఆక్షన్‌ (పీఏసీ)’ కింద ఈ బ్యాంకులను నెట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో పేరుకుపోయిన 12 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిల్లో 90 శాతం బకాయిలు ప్రభుత్వరంగ బ్యాంకులవే. ఇప్పటికే కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసినా, నూతన సిబ్బంది నియామకాలను నిలిపివేసినా పరిస్థితి మెరుగుపడలేదు. 

రుణాల మాఫీ కోసం, సరైన గిట్టుబాటు ధరల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన  చేసినప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా రైతుల రుణాల మాఫీకి మోదీ ప్రభుత్వం సాహసించలేకపోయిందంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా లేదా దారణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది, అంటే 2019, మేలోగా సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్‌కుగానీ, వినియోగదారుడికిగానీ నగదు కొరత రాలేదు. దేశ ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే సరిగ్గా ఎన్నికల సమయానికి నగదు కొరత పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే నరేంద్ర మోదీ ప్రభుత్వం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) రిజర్వ్‌ నిధుల మీద కన్నేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద రిజర్వ్‌ నిధులు 9.6 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆపధర్మ నిధి కింద 3.6 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. 

ఏ ప్రభుత్వానికి ఇవ్వలేదు
దేశంలోని బంగారం, ఫారెక్స్‌ నిల్వలు పడిపోయినప్పుడల్లా వాటి నిర్దేశిత స్థాయిని కొనసాగించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ రిజర్వ్‌ నిధులను విడుదల చేస్తుంది. ఇక ఆపధర్మ నిధిని అనుకోకుండా భవిష్యత్తులో వచ్చే అవసరాల కోసం వాడాలని ఏర్పాటు చేసుకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949లో రిజర్వ్‌ బ్యాంకును జాతీయం చేయగా, ఈ ఆపధర్మ నిధిని 1950లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం కూడా ఆపధర్మ నిధులను అడగలేదు. ఆర్బీఐ ఇవ్వలేదు. 

ఉర్జిత్‌ పటేల్‌పై అదే ఒత్తిడి
ఆర్బీఐ ఆపధర్మ నిధి నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం గతకొంత కాలం నుంచి మొన్నటివరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్‌ పటేల్‌పై ఒత్తిడి చేస్తూ వచ్చింది. తమ మాట వినకపోతే ఆర్బీఐ చట్టంలోని ఏడో షెడ్యూల్‌ కింద ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఉర్జిత్‌కు హెచ్చరిక కూడా చేశారు. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని రక్షించడం కోసం గతంలో ఏ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను ఉపయోగించలేదు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ బోర్డు సభ్యులు రెండు, మూడు సార్లు సమావేశమై ప్రభుత్వ ప్రతిపాదన గురించి చర్చించారు. ప్రభుత్వానికి సానుకూలంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేశారు. కాకపోతే వ్యక్తిగత కారణాలపై రాజీనామా చేస్తున్నానని చెప్పుకున్నారు. మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పదవీ కాలాన్ని పొడిగించకుండా ఉర్జిత్‌ పటేల్‌ను కోరి తెచ్చుకున్నందుకు ఆయనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాల్సిందే. కానీ రెండు లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఇచ్చేంత కృతజ్ఞత చూపలేకపోయారు. ఓ ఆర్థిక నిపుణుడిగా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయనకు తెలుసు కనుక. 

కొత్త గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఎవరు?
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను తీసుకొచ్చారు. ఆయన రఘురామ్‌ రాజన్, ఉర్జిత్‌ పటేల్‌లాగా ఆర్థికవేత్త కాదు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్‌ ఆఫీసర్‌. ప్రస్తుత 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఐఏఎస్‌ ఆఫీసర్‌ను నియమించడం ఇదే కొత్తకాదు. గతంలో 14 మంది ఐఏఎస్‌–ఐసీఎస్‌ ఆఫీసర్లు పనిచేశారు. వారిలో ఎక్కువమంది ఆర్థిక వేత్తలే. 1990లో ఎస్‌. వెంకటరామన్‌ తర్వాత చదువురీత్యా ఆర్థిక వేత్తకానీ వ్యక్తిని తీసుకరావడం ఇదే మొదటిసారి. 

కొత్త గవర్నర్‌ ప్రభుత్వం మాట వింటారా?
అక్షరాలా వింటారు. ఎందుకంటే పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల ఏర్పడిన సంక్షోభంలో ఎప్పటికప్పుడు కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ అడుగడుగున సమర్థిస్తూ వచ్చిందీ ఈ శక్తికాంత దాసే. అయినా ఆయన ఇప్పటికీ పెద్ద నోట్లను రద్దు చేయడం తప్పుకాదంటారు. 

అసలేం అవుతుంది ?
మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీఐని దేవురించాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత తెచ్చిన జీఎస్టీనే. ఈ విషయాన్ని మోదీ ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదు. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా మోదీ పక్షాన నిలిచిన శక్తికాంత దాస్, ఇప్పుడు కూడా ఆయన పక్షానే నిలిచి సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడవచ్చు! ఆ నిర్ణయం వల్ల 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ పార్టీ గట్టెక్కవచ్చు. కానీ ఐదేళ్లకాలంలోనే జింబాబ్వే, అర్జెంటీనా, వెనిజులాలో తలెత్తిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభాలు భారత్‌కు కూడా తప్పకపోవచ్చు. ఆ మూడు దేశాల్లో ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు ప్రభుత్వాలు సెంట్రల్‌ బ్యాంకులను (మన రిజర్వ్‌ బ్యాంక్‌కు సమానం) స్వాధీనం చేసుకున్న పర్యవసానంగా సామాజిక, రాజకీయ సంక్షోభాలు తలెత్తాయి. 


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా