రూపాయిని పడేసిన ‘దాడులు’

28 Feb, 2019 00:37 IST|Sakshi

17 పైసలు తగ్గి 71.24 వద్ద ముగింపు

ముంబై: భారత్‌–పాక్‌ ఉద్రిక్తతల ప్రభావం బుధవారం రూపాయి విలువపై పడింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 17 పైసలు తగ్గి 71.24 వద్ద ముగిసింది. పటిష్టంగా ఉన్న క్రూడ్‌ ఆయిల్‌ ధరలు, దేశీయ ఈక్విటీ మార్కెట్ల బలహీనతలు కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మంగళవారం ముగింపు 71.08 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 71.49–70.94 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడింది. రూపాయి బలహీనత వరుసగా ఇది రెండవసారి.  

అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అంతర్జాతీయంగా ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో...రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ క్రూడ్‌ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి 12 డాలర్లకుపైగా పెరగడంతో రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది. ఈక్విటీ మార్కెట్ల నష్టాలూ ఇందుకు తోడవుతున్నాయి. ఆయా పరిస్థితుల్లో రూపాయి ప్రస్తుతం 72–69.50 శ్రేణిలో స్థిరీకరణ బాటలో ఉందని భావిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రేటజీ హెడ్‌ వీకే శర్మ విశ్లేషించారు.   
 

మరిన్ని వార్తలు