జోరందుకున్న ఎయిర్‌ జర్నీ 

25 Oct, 2018 01:07 IST|Sakshi

19 % పెరిగిన ప్రయాణికుల సంఖ్య

గతనెలలో 114 లక్షల మంది...

ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య గతనెలలో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 114 లక్షల మంది దేశీ విమానాల్లో ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) తాజాగా విడుదలచేసిన డేటా ద్వారా వెల్లడైంది. ఏడాది ప్రాతిపదికన 18.95 శాతం  వృద్ధి రేటు నమోదైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో 95.83 లక్షల మంది ప్రయాణికులు దేశీ విమానాల్లో ప్రయాణం చేశారు. గతనెలలో ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరగడానికి.. భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు, పండుగల సీజన్‌ కావడమే ప్రధాన కారణమని డీజీసీఏ విశ్లేషించింది. 

నెంబర్‌ వన్‌ స్థానంలో ఇండిగో  
అత్యధిక ప్రయాణికులతో ఇండిగో మరోసారి రికార్డు సృష్టించింది. గతనెలలో 49.20 లక్షల మంది  ప్రయాణీకులతో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది.  మార్కెట్‌ వాటా 43.20%గా నమోదైంది. ఆ తరువాత స్థానంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌ మార్కెట్‌ వాటా 14.2%కి పరిమితమైంది. ఈ ఎయిర్‌లైన్స్‌లో 16.13 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. స్పైస్‌ జెట్‌ ప్రయాణికుల సంఖ్య 13.63 లక్షలు కాగా, మార్కెట్‌ వాటా 12 శాతం. 13.45 లక్షల మంది ప్రయాణికులతో ప్రభుత్వ రంగ ఎయిర్‌ ఇండియా మార్కెట్‌ వాటా 11.8 శాతంగా నమోదైంది. 

>
మరిన్ని వార్తలు