మన విమానయానం.. జెట్ స్పీడ్!

18 Mar, 2016 00:35 IST|Sakshi
మన విమానయానం.. జెట్ స్పీడ్!

ఐదేళ్లలో ప్రయాణికులు రెట్టింపు... 38 కోట్లకు
దేశీ విమానయాన రంగంపై ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక
2030 నాటికి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా ఇండియా
తగ్గిన ఇంధన ధరలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలే వృద్ధికి కారణాలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంధన ధరలు గణనీయంగా తగ్గడంతో దేశంలో విమానయానం కూడా అందుబాటులోకి వస్తోందని ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక తెలియజేసింది. టికెట్ల ధరలు తగ్గుతుండటం, అదే సమయంలో మధ్యతరగతి ప్రజల ఆదాయం పెరగటం వంటివి దీనికి కారణమని తెలియజేసింది. ‘‘దేశీ విమానయాన రంగ మార్కెట్ పరిమాణం సుమారు రూ.1.07 లక్షల కోట్లు. ఈ విషయంలో భారత్‌ది ప్రపంచంలో తొమ్మిదవ స్థానం. ఇదే పెరుగుదల కొనసాగితే 2020 నాటికి మూడో స్థానానికి, 2030 నాటికి మొదటి స్థానానికి చేరుతుంది’’ అని నివేదిక అంచనా వేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏవియేషన్ ప్రదర్శనలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గురువారం ఈ నివేదికను లాంఛనంగా విడుదల చేశారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2015 కేలండర్ ఇయర్‌లో దేశీయ విమాన సర్వీసుల సంఖ్య 20.3 శాతం వృద్ధితో 8.1 కోట్లకు చేరినట్లు నివేదికలో పేర్కొన్నారు.

2015లో 19 కోట్లుగా ఉన్న ప్రయాణీకుల సంఖ్య వచ్చే ఐదేళ్లలో రెట్టింపై 38 కోట్లకు చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. ప్రాంతీయ సేవలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టడం, చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయడం ఈ వృద్ధికి దోహదం చేస్తాయని తెలియజేసింది. విదేశాలతో పోలిస్తే విమాన ఇంధనంపై పన్నులు అధికంగా ఉన్నాయని, వీటిని క్రమబద్ధీకరించి, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తే ఈ రంగం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని వివరించింది. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి మాట్లాడుతూ విమానాశ్రయాల అభివృద్ధిలో రాష్ట్రాలు పోటీ పడటం ఒక మంచి పరిణామంగా పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో విమానాశ్రయాల అభివృద్ధికి కేటాయిస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉందని, ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 25,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు అవసరమవుతాయని ఫిక్కీ-కేపీఎంజీ నివేదిక అంచనా వేసింది.

whatsapp channel

మరిన్ని వార్తలు