అమ్మో... టెలికం!! 

20 Dec, 2017 23:57 IST|Sakshi

వేల కోట్ల నష్టాలతో బిచాణా ఎత్తేసిన విదేశీ సంస్థలు 

వాటితో జట్టుకట్టి దివాలా స్థాయికి చేరిన దేశీ కంపెనీలు 

2జీ స్కామ్‌ కేసులతోనే చాలా కంపెనీల గుడ్‌బై 

భాగస్వామితో పడక బయటికొచ్చేసిన యూనిటెక్‌  

వ్యాపారం నడపలేక ఎయిర్‌టెల్‌తో కలిసిన టెలినార్‌ 

విలీనానికి నియంత్రణల అడ్డంకితో... దిక్కుతోచని ఎయిర్‌సెల్‌ 

ఎంటీఎస్, ఎటిసలాట్, బాటెల్కో... అన్నీ బైబై 

కొందరేమో 2జీని... కుంభకోణాల ముత్తాతగా పిలుస్తారు. కాకపోతే టెలికం కంపెనీలు బిచాణా ఎత్తేయటం వెనకున్న కారణాలన్నిటికీ ఇదే ముత్తాత అని కూడా చెప్పొచ్చు. కొన్నేళ్లుగా మన టెలికం రంగంలో కంపెనీలకు ఘోరమైన దెబ్బలు తగిలాయి. అవెంత తీవ్రమైనవంటే... కొన్ని దివాలా స్థాయికి పోయాయి కూడా. సొంతగా... కొన్ని విదేశీ సంస్థలతో జతకట్టి... వేల కోట్ల రూపాయలు  పెట్టుబడి పెట్టిన సంస్థలు... చివరకు పెట్టుబడి కోల్పోవటమే కాక అప్పులుæ మిగుల్చుకున్నాయి. దేశీ టెలికం రంగం రూ.4.5 లక్షల కోట్ల రుణభారాన్ని మోస్తోందంటేనే పరిస్థితి ఈజీగా అర్థమయిపోతుంది. దేశంలో దిగ్గజ    సంస్థలైన యూనినార్‌..  వీడియో కాన్, ఖైతాన్‌ వంటివి టెలికామ్‌లో మాత్రం అన్నీ రాంగ్‌ కాల్సే చేశాయి. ఇక విదేశీ దిగ్గజాలకైతే లెక్కలేదు. నార్వే దిగ్గజం టెలినార్‌. హాంకాంగ్‌  ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ హచ్‌. రష్యా సంస్థ సిస్టెమా టెలీ (ఎంటీఎస్‌), మలేసియా నంబర్‌–1 మ్యాక్సిస్‌... జపాన్‌ అగ్రగామి డొకోమో.. ఎమిరేట్స్‌లో జెండా ఎగరేసిన ఎటిసలాట్‌.. ఇవి భారతీయ మొబైల్‌ యూజర్‌కు చేసిన కాల్స్‌ కనెక్టే కాలేదు. ఫలితం... వేల  కోట్ల నష్టాలు. అప్పుల కుప్పలు. ఆ కథేంటో వివరించేదే ఈ కథనం..

(సాక్షి, బిజినెస్‌ విభాగం) : టెలినార్‌ కథ ఎనిమిదేళ్లలో కంచికి చేరిపోయింది. 13 దేశాల్లో నెట్‌వర్క్‌లుండి, 29 దేశాల్లో కార్యకలాపాలున్న ఈ బహుళజాతి ప్రభుత్వ సంస్థ... యూనిటెక్‌తో జట్టుకట్టడమే కలిసిరాలేదని కొందరంటారు. 2008లో 22 సర్కిళ్లకు లైసెన్స్‌లు దక్కించుకున్న యూనిటెక్‌ వైర్‌లెస్‌లో 67.25 శాతం వాటాను రూ.6,500 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేయటం ద్వారా దేశంలోకి ప్రవేశించిందీ సంస్థ.  రెండేళ్లు తిరక్కుండానే 3 కోట్ల సబ్‌స్క్రైబర్లు, 13 సర్కిళ్లకు విస్తరించింది. కాకపోతే 2జీ స్కామే దీన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు పలు సర్కిళ్లలో లైసెన్సుల్ని రద్దు చేసినా... మిగతా సంస్థల్లా వెనుదిరిగి వెళ్లిపోకుండా నిలబడింది యూనినార్‌. కాకపోతే లైసెన్సుల రద్దుతో వచ్చిన నష్టానికి గాను యూనిటెక్‌కు నోటీసులివ్వటం... ఇద్దరూ కోర్టుకెక్కటం కలిసిరాలేదనే చెప్పాలి. ఫలితం...  నామమాత్రపు ధరకు వాటా వదిలేసి యూనిటెక్‌ వెళ్లిపోయింది. సొంతగా రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టి మరిన్ని వేల కోట్లు ఖర్చు చేసినా... వినియోగదారులు మాత్రం పెరగలేదు. రెండో ఇన్నింగ్స్‌ తొలి 9 నెలల్లోనే రూ.5,825 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. ఇక జియో ఎంట్రీతో మనుగడ సైతం కష్టమయింది. చివరకు తన నెట్‌వర్క్‌ను భారతీ ఎయిర్‌టెల్‌కు విక్రయించేసి... కథ ముగించింది. ఈ డీల్‌ ద్వారా  రూ.2వేల కోట్లవరకూ టెలినార్‌కు దక్కినట్లు తెలుస్తోంది. 

రూ.23,000 కోట్లకు రూ.420 కోట్లు.. 
రష్యాకు చెందిన ఎంటీఎస్‌ కూడా ఇండియాలో సీడీఎంఏ టెక్నాలజీనే ఎంచుకుంది. దేశవ్యాప్త నెట్‌వర్క్‌కు రూ.22,750 కోట్లు ఖర్చుచేసింది. దేశమంతా సర్వీసులు ఆరంభించినా... ఎక్కడా ప్రభావవంతమైన పనితీరు కనబరచలేకపోయింది. నష్టాలు పెరగటంతో చివరకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌లో విలీనమైంది. అది కూడా... ఆర్‌కామ్‌ తన సంస్థలో 10 శాతం వాటా ఇచ్చింది తప్ప నగదేమీ ఇవ్వలేదు. ప్రస్తుతం దీని విలువ దాదాపు రూ.470 కోట్లు. 

హచ్‌... లాభాలతోనే వైదొలిగింది! 
హాంకాంగ్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం హచిసన్‌... దేశంలో ఉక్కు దిగ్గజం ఎస్సార్‌తో జతకట్టడం ద్వారా టెలికంలోకి దిగింది. వచ్చీ రావటంతోనే భారీ ప్రచార వ్యూహానికి తెర తీసింది. త్వరగానే పలు సర్కిళ్లలో  పాగా వేసింది. ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ కావటంవల్లో ఏమో!! వచ్చినంత వేగంగానే తన వాటాను 2007లో ఏకంగా 11 బిలియన్‌ డాలర్లకు యూకే దిగ్గజం వొడాఫోన్‌కు విక్రయించి వైదొలిగింది.  2011లో ఎస్సార్‌కున్న 33% వాటాను కూడా 5 బిలియన్‌ డాలర్లు చెల్లించి వొడాఫోన్‌ కొనుగోలు చేసింది. హచ్‌–ఎస్సార్‌... రెండిటిదీ సరైన ఎగ్జిట్‌గానే చెబుతారు నిపుణులు.  

మాక్సిస్‌ దారి ఎటు..? 
మలేసియా దిగ్గజం మ్యాక్సిస్‌ది అయోమయ పరిస్థితి. దీనికి ఎయిర్‌సెల్‌లో 74% వాటా ఉంది. భారత్‌లో ఇప్పటిదాకా రూ.47,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. జియో ప్రవేశంతో రాబడులు దారుణంగా పడిపోవటంతో భారత్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది.  ఆర్‌కామ్‌తో డీల్‌ చేసుకున్నా... దానికి నియంత్రణ సంస్థలు మోకాలడ్డాయి. ఇప్పటికీ రూ.15,500 కోట్లకుపైగా రుణభారం మోస్తున్న ఈ సంస్థకు భవిష్యత్‌ అయోమయంగానే కనిపిస్తోంది. కొన్ని సర్కిళ్లలో ఇప్పటికే సేవలు నిలిపేసింది కూడా.  

బాటెల్కో.. తొలి బకరా? 
ఎస్‌ టెల్‌లో తనకున్న 42.7% వాటాను బహ్రైన్‌ టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీ (బాటెల్కో) ఎంత ధరకు కొన్నదో అంతే ధరకు 17.5 కోట్ల డాలర్లకు విక్రయించింది. ఈ పెట్టుబడులపై  వడ్డీని మాత్రమే బాటెల్కో నష్టపోయింది. భారత్‌ నుంచి మొదట వైదొలగిన విదేశీ కంపెనీ ఇదే.  35 లక్షల మంది వినియోగదారులతో ఆరు టెలికం సర్కిళ్లలో సేవలందించిన ఈ కంపెనీని... శివశంకరన్‌కు చెందిన శివ గ్రూప్‌ నిర్వహించేది. 1997–98లో ఎయిర్‌సెల్‌ను ప్రారంభించిన శివ... దీన్ని మలేషియాకు చెందిన మాక్సిస్‌ గ్రూప్‌కు భారీ ధరకు విక్రయించటం ద్వారా వెలుగులోకి వచ్చారు. సుప్రీంకోర్టు 2జీ లైసెన్సుల్ని రద్దు చేసిన వెంటనే బాటెల్కో తన వాటాను విక్రయించేసుకుని బయటపడింది. 

రెండో వికెట్‌... ఎటిసలాట్‌ 
ఎటిసలాట్‌ డీబీ.. భారత్‌ నుంచి నిష్క్రమించిన రెండో విదేశీ కంపెనీ.  దేశీ రియల్టీ సంస్థ డీబీ కార్ప్‌తో కలిసి ఎటిసలాట్‌–డీబీని ఏర్పాటు చేసింది. 2జీ  కేసులో సుప్రీం రద్దు చేసిన 122 లైసెన్సుల్లో ఈ కంపెనీ లైసెన్స్‌లూ ఉండటంతో ఎటిసలాట్‌ దుకాణం కట్టేసింది. 16.7 లక్షల మంది కస్టమర్లను... 82 కోట్ల డాలర్ల విలువైన భారత టెలికం కార్యకలాపాలను వదిలేసుకుని వెళ్లిపోయింది.  

లూప్‌ మొబైల్‌... కేసులు మిగిలాయి.. 
భారత్‌లో తొలి మొబైల్‌ ఆపరేటర్‌ లూప్‌. 1995లో బీపీఎల్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌  పేరిట రంగంలోకి దిగింది. దీన్లో 99% వాటాను రూ.700 కోట్లకు ఖైతాన్‌ గ్రూప్‌ 2005లో కొనుగోలు చేసింది. 2009లో కంపెనీ పేరు లూప్‌మొబైల్‌గా మారింది. 2014లో దీన్ని రూ.700 కోట్లకు కొనటానికి ఎయిర్‌టెల్‌ డీల్‌ కుదురినా.. అమల్లోకి రాకముందే రద్దయిపోయింది. దీం తో 2014లో కార్యకలాపాలు నిలిపేసింది.


భారతీయ టెలికం రంగంలో మూలధనంపై రాబడి 1 శాతంగా  ఉంది. కంపెనీలు వాటి డబ్బుల్ని ఇక్కడి టెలికం రంగంలో ఇన్వెస్ట్‌ చేయటం కన్నా బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసుకోవటం ఉత్తమం. 
– గోపాల్‌ విట్టల్‌ (ఎయిర్‌టెల్‌ సీఈఓ)  

మరిన్ని వార్తలు