కరోనా ఎఫెక్ట్‌ : సగానికి పడిపోయిన వాహన విక్రయాలు

13 Apr, 2020 15:42 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు అన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనంతో అసలే తక్కువగా ఉన్న ఆటోమొబైల్‌ సేల్స్‌ కరోనా ఎఫెక్ట్‌తో మరింత దిగజారాయి. మార్చిలో దేశీ ప్రయాణీకుల వాహన విక్రయాలు 51 శాతం పడిపోయాయని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సొసైటీ (ఎస్‌ఐఏఎం) పేర్కొంది. గత ఏడాది ఇదే మాసంలో 2,91,861 యూనిట్లు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో కేవలం 1,43,014 యూనిట్ల విక్రయాలు సాగాయని ఎస్‌ఐఏఎం నివేదిక పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో దేశీ వాహన విక్రయాలు 7.61 శాతం తగ్గుదల నమోదు చేశాయని గత నెలలో ఎస్‌ఐఏఎం వెల్లడించిన నివేదిక పేర్కొంది.

భారత్‌లో పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ముడిపదార్ధాల్లో పదిశాతంపైగా చైనా నుంచి తెప్పించుకుంటాయని ఆ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అన్ని కేటగిరీల్లో వాహనాల ఉత్పత్తి తగ్గుతుందని ఎస్‌ఐఏఎం గత నెలలోనే పేర్కొంది. దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి భయాలు వెంటాడటంతో డిమాండ్‌ దెబ్బతిందని, వినియోగదారుల్లో సెంటిమెంట్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఎస్‌ఐఏఎం డైరెక్టర్‌ జనరల్‌ రాజేష్‌ మీనన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో దేశంలో ప్రయాణీకుల వాహన విక్రయాల్లో భారీ తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. మార్చిలో వాణిజ్య వాహన విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. 2019 మార్చిలో 109022 కమర్షియల్‌ వాహనాలు అమ్ముడవగా ఈ ఏడాది మార్చిలో 88 శాతం తగ్గి కేవలం 13,027 యూనిట్ల విక్రయాలు సాగాయి. మరోవైపు త్రిచక్ర వాహనాల విక్రయాలు మార్చిలో 59 శాతం పడిపోగా, బైక్‌ సేల్స్‌ 39.83 శాతం మేర తగ్గాయి.

చదవండి : పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా