చైనాపై సుంకాలకే ట్రంప్‌ మొగ్గు!!

17 Sep, 2018 00:55 IST|Sakshi

టారిఫ్‌ల అమలు నేటి నుంచే

వాషింగ్టన్‌: చైనాతో ప్రతిపాదిత చర్చల ఫలితాలు ఎలా ఉన్నా ఆ దేశం నుంచి మరిన్ని దిగుమతులపై సుంకాలు విధించాలన్న నిర్ణయాన్ని అమలు చేసేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొగ్గు చూపుతున్నారు.  దాదాపు 200 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై కొత్తగా టారిఫ్‌లను అమలు చేసే విషయంలో ట్రంప్‌ ముందుకే వెళ్లనున్నట్లు ది వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ టారిఫ్‌ల అమలు సోమవారం నుంచే ప్రారంభంకావచ్చని ఈ కథనంలో పేర్కొన్నారు.

సుంకాలు గతంలో విధించిన 25 శాతం కన్నా తక్కువ స్థాయిలో సుమారు 10 శాతం మేర ఉండొచ్చని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాన్ని ప్రచురించింది. టారిఫ్‌ల వివాదంపై చర్చించుకునేందుకు అమెరికాను ఆహ్వానించినట్లు చైనా వెల్లడించిన నేపథ్యంలో ఈ కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల దిగుమతులపై ఇరు దేశాలు 25% టారిఫ్‌లు విధించింది.

ఒకవేళ అమెరికా గానీ మరో దఫా తమ దిగుమతులపై సుంకాలు విధించిన పక్షంలో.. ప్రతిగా తాము 60 బిలియన్‌ డాలర్ల పైగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించడం ఖాయమని చైనా కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై అమెరికా విధించిన సుంకాల ప్రభావం మన దేశ పరిశ్రమపైనా ప్రభావం చూపిస్తుందని అసోచామ్‌ తన నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు